- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేంద్ర కమిటీతో ఎమ్మెల్యే పాయం భేటీ
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల స్థానికంగా తలెత్తుతున్న ముంపు సమస్యలు, రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందుల పై పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గళమెత్తారు.

దిశ, బూర్గంపాడు : పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల స్థానికంగా తలెత్తుతున్న ముంపు సమస్యలు, రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందుల పై పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గళమెత్తారు. బూర్గంపాడు మండలం సారపాకలోని ఐటీసీ పీఎస్‌పీడీ గెస్ట్ హౌస్‌లో గురువారం పోలవరం ప్రాజెక్టు అథారిటీ కమిటీ, కేంద్ర జలవనరుల సంఘం ప్రతినిధుల ఉన్నతస్థాయి బృందంతో ఎమ్మెల్యే ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పినపాక, భద్రాచలం నియోజకవర్గాల పరిధిలోని, ముఖ్యంగా బూర్గంపాడు మండలంలోని ప్రభావిత ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కేంద్ర ప్రతినిధుల బృందంతో స్థానిక భౌగోళిక, సామాజిక పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ కారణంగా పినపాక, భద్రాచలం నియోజకవర్గాల పరిధిలోని బూర్గంపాడు మండల గ్రామాలు ఏటా వరద ముంపునకు గురవుతున్న పరిస్థితిని వివరించారు. ముంపు కారణంగా వేలాది ఎకరాల్లో పంట నష్టం జరుగుతోందని, స్థానిక రైతాంగాన్ని ఆదుకునేందుకు శాశ్వత నష్టనివారణ చర్యలు చేపట్టాలని కోరారు. బాధితులకు సకాలంలో న్యాయబద్ధమైన ఆర్థిక పరిహారం, పునరావాసం కల్పించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు.
కేవలం సమస్యలను వివరించడమే కాకుండా, స్థానిక మీడియా ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల ముఖ్య నాయకులు, అలాగే బాధిత రైతుల నుంచి సేకరించిన క్షేత్రస్థాయి సమాచారంతో కూడిన సమగ్ర నివేదికను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కేంద్ర బృందానికి అందజేశారు. ముంపు ప్రాంతాల ప్రజల ప్రయోజనాలే ధ్యేయంగా కేంద్ర కమిటీ స్పందించి, బాధితులకు తగిన న్యాయం చేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ సమావేశంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.






