భర్త జాడ కోసం భార్య వెతుకులాట.. ఈ కష్టం పగవారికి కుడా రాకూడదు..

76
ayesha

దిశ, ఏపీ బ్యూరో: పరాయి పురుషుడి మోజులో పడి భర్తను భార్యలు మట్టుబెడుతున్న రోజులివి. మరికొంతమంది అయితే భర్త ఉన్నప్పటికీ వ్యామోహంతో పరాయి వ్యక్తుల మోజులోపడి కుటుంబాలను సైతం నిర్లక్ష్యం చేస్తున్న మహిళలు ఉన్న కాలం ఇది. అయితే అందుకు భిన్నంగా ఓ మహిళ తన భర్త జాడ కోసం అహర్నిశలు శ్రమిస్తుంది. జీవితాంతం తోడుగా ఉంటానని పెళ్లినాడు ప్రమాణం చేసిన భర్త వరదల్లో కొట్టుకుపోయాడు. దీంతో తన భర్త జాడ తెలుసుకునేందుకు ఆ భార్య తల్లడిల్లుతుంది. రాత్రనకా.. పగలనకా తేడా లేకుండా నిద్రహారాలు మానేసి తన భర్త ఆచూకీ కోసం గాలిస్తుంది. దారిన పోతుండగా ఎదురొచ్చిన ప్రతీ ఒక్కరినీ తన భర్త ఆచూకీ తెలపమంటూ వేడుకుంటుంది. మా ఆయన కనిపించాడా అంటూ ఇతరులను అడుగుతున్న తీరు అందరి హృదయాలను కలచివేస్తోంది. ఇదేదో కహాని సినిమా స్టోరీ చెప్తున్నారు అనుకుంటున్నారంటే పొరబడినట్లే. ఇది యదార్థగాథ. గుండెలను పిండేస్తున్న ఈ ఘటన వైఎస్ఆర్ కడప జిల్లాలో చోటు చేసుకుంది.

ఊరురా తిరుగుతున్న అయేషా..

వివరాల్లోకి వెళ్తే కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం గుండ్లూరుకు చెందిన రషీద్, అయేషా దంపతులు. ఈ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అయితే ఈనెల 19న వచ్చిన వరదలు దంపతులను విడదీశాయి. అన్నమయ్య జలాశయం తెగిపోవడంతో చెయ్యేరు నది గుండ్లూరు, పులపుత్తూరు, మందపల్లె, తోగూరుపేట గ్రామాలను ముంచేసింది. దీంతో బంధువులు అందరూ చూస్తుండగానే రషీద్ నదిలో కొట్టుకుపోయారు. అప్పటి నుంచి రషీద్ ఆచూకీ కోసం అయేషా తిరుగుతూనే ఉంది. రాజంపేటతో పాటు చుట్టుపక్క గ్రామాల్లో సైతం భర్త జాడ కోసం అన్వేషించింది. దారిన కనబడే ప్రతీ ఒక్కరినీ తన భర్త ఫోటో చూపించి ఎక్కడైనా చూస్తే చెప్పాలంటూ వేడుకుంటుంది. ఇకపోతే చెయ్యేరు నది ఉధృతిలో కొట్టుకుపోయిన 38 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. తన భర్త బతికే ఉన్నాడని బలంగా నమ్ముతున్న అయేషా కాళ్లరిగేలా రాత్రనకా పగలనగా ఊరూరా తిరుగుతూనే ఉంది. అధికారులను తన భర్త గురించి చెప్పాలంటూ వేడుకుంది. అయితే వారు కూడా ఏమీ చెప్పలేక చేతులెత్తేశారు. దీంతో ఆమె కనీసం చనిపోయిన వారి మృతదేహాలను అయినా చూపించాలని వేడుకుంది. మృతదేహాలను చూసే ముందు వాటిలో తన భర్త ఉండకూడదంటూ ఆ దేవుడిని కోరుకునేది. మృతదేహాలను పరిశీలిస్తే తన భర్త పోలిన డెడ్ బాడీ లేకపోవడంతో ఊపిరి పీల్చుకుంది. తన భర్త బతికే ఉన్నాడంటూ మరింత నమ్మింది. భర్త ఆచూకీ కోసం మూడు రోజులుగా తిరుగుతూనే ఉంది.

సీఎం జగన్‌కు అయేషా విజ్ఞప్తి..

మూడు రోజులుగా రాజంపేటతోపాటు ఇతర ప్రాంతాలను అయేషా తిరిగేసింది. కానీ ఎక్కడా భర్త ఆచూకీ లభించలేదు. తన భర్త ఆచూకీ కనిపెట్టాలంటూ ఆమె ప్రభుత్వాన్ని వేడుకుంటుంది. అన్నమయ్య జలాశయం తెగిపోతుందన్న విషయం అధికారులు చెప్పి ఉంటే ముందస్తుగా జాగ్రత్త పడేవాళ్లమని వెల్లడిస్తోంది. తన భర్త ఏమయ్యాడో తెలియడం లేదని తనకు దిక్కెవరంటూ గుండెలు పగిలేలా అయేషా విలపిస్తుంది. తన భర్తను వెతికించాలని ముఖ్యమంత్రి జగన్‌ను ఆమె కోరుతుంది. అంతేకాదు భర్తతో గడిపిన క్షణాలను గుర్తు తెచ్చుకుని ఆమె గుండెలు పగిలేలా రోదిస్తుంది. రషీద్ బతికి ఉంటే వచ్చేవాడని ఇన్ని రోజులు అయినా అతడి జాడ తెలియలేదంటే చనిపోయి ఉంటాడంటూ ఇరుపొరుగువారు అంటుండటంతో అది విని మరింత దీనంగా రోదిస్తోంది. తనకు దిక్కెవరంటూ ఆమె విలపిస్తున్న తీరు అందరి హృదయాలను కదలించి వేస్తుంది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..