భర్త అడ్డు తొలగించుకున్న భార్య.. ముగ్గురు అరెస్టు

97
Man brutally murdered

దిశ, కోదాడ : సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఈనెల 6వ తేదీన ఓ వ్యక్తిని హత్య చేసిన ఘటనలో కోదాడ పట్టణ పోలీసులు ఆ వ్యక్తి భార్యతో సహా ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్‌‌కు తరలించారు. వివాహేతర సంబంధం వల్లే ఈ హత్య జరిగినట్లు పోలీసులు గుర్తించారు. కోదాడ పట్టణ పోలీస్‌‌స్టేషన్‌‌లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ రఘు, పట్టణ సీఐ నర్సింహరావులు ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. కోదాడ పట్టణంలోని రాజీవ్‌‌నగర్‌‌లో నివాసముండే మునూరి వెంకన్న అలియాస్‌‌ రాముకు హాలియా మండలం హజారిగూడెంకు చెందిన సైదమ్మతో 13ఏళ్ల కిందట వివాహం జరిగింది. గ్యాస్‌ ‌స్టవ్‌ ‌మెకానిక్‌‌గా పనిచేసే వెంకన్న గత కొన్నేళ్ళుగా జీవనోపాధి కోసం మిర్యాలగూడలో నివాముంటున్నాడు. ఈ నేపధ్యంలో హైదరాబాద్‌‌లో హోంగార్డుగా పనిచేస్తున్న మిర్యాలగూడకు చెందిన బుడిగ సైదులుతో సైదమ్మకు 2 సంవత్సరాల క్రితం వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలియడంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వెంకన్న 7 నెలల కిందట తన మకాంను కోదాడకు మార్చాడు.

దీనితో తమ అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని వెంకన్నపై సైదమ్మ, సైదులు కోపం పెంచుకుని అతడిని హత్య చేసేందుకు ప్లాన్‌‌ చేశారు.ప్లాన్‌‌ ప్రకారం సైదమ్మ గతంలో మిర్యాలగూడలో తనకు పరిచయం ఉన్న కోట్ల కమలాకర్‌‌తో తనను భర్త హింసిస్తున్నాడని అతడిని చంపాలని కోరడంతో పాటు అతడితో బేరం కుదుర్చుకున్నారు. ఒప్పందం ప్రకారం రూ.50 వేల నగదు 2 తులాల బంగారు చైన్‌‌ను కమలాకర్‌‌కు సైదమ్మ ఇచ్చింది.ఈ నెల 6వ తేదీన వెంకన్న తన భార్యను గట్టిగా మందలించి ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు. దీనితో సైదమ్మ కమలాకర్‌‌‌కు ఫోన్‌‌ చేసి ప్లాన్‌ ‌ప్రకారం చంపాలని కోరింది. దీనితో అతడు కోదాడకు చేరుకుని మద్యంతో పాటు మత్తు మాత్రలను తెచ్చి వెంకన్నను కలిసి అతడికి మద్యంతో పాటు మత్తు కలిపిన వాటర్‌‌‌ను తాగిపించాడు.

దీనితో మత్తులోకి జారుకున్న వెంకన్నను పక్కనే ఉన్న బండరాయితో తల, ముఖంపై కొట్టి హత్య చేసి పారిపోతూ సైదమ్మకు ఫోన్‌‌చేసి విషయం చెప్పాడు. 7వ తేదీ ఉదయం ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. సైదమ్మపై అనుమానంతో గురువారం ఉదయం ఇంట్లో ఉన్న ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో మిర్యాలగూడ సైదులు, కమలాకర్‌‌ లను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నేరం చేసినట్లుగా అంగీకరించారు. దీంతో ఇరువురిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసును సీఐ నర్సింహారావు ఆధ్వర్యంలో పట్టణ ఎస్‌‌ఐలు రవీందర్‌‌, క్రాంతికుమార్‌‌, సిబ్బంది మల్లారెడ్డి, ఉపేందర్‌‌, నర్సింహారావు, గౌతమిలు స్వల్ప వ్యవధిలో చేధించారని వారికి అభినందనలు తెలిపారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..