- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చెత్త సమస్యకు చెక్ పెట్టేందుకు సీఎంసీ అడుగులు
మల్కాజిగిరి నగర పాలక సంస్థ ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నగర పరిధిలోని ‘బల్క్ వేస్టేజ్ జనరేటర్ల’ గుర్తింపు, వారి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది.

దిశ, మేడ్చల్ బ్యూరో : ఆధునిక జీవన శైలి కారణంగా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగైనప్పటికీ, మరోవైపు వస్తు వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ప్రస్తుతం మార్కెట్‌లో యూజ్ అండ్ త్రో సంస్కృతి పెరగడంతో వస్తువుల ఉత్పత్తితో పాటు సాలిడ్ వేస్ట్ సమస్య అంతకంతకూ జటిలమవుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో ఈ సమస్య రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. ఘన వ్యర్థాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా మల్కాజిగిరి నగర పాలక సంస్థ ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నగర పరిధిలోని ‘బల్క్ వేస్టేజ్ జనరేటర్ల’ (భారీ వ్యర్థాల ఉత్పత్తిదారులు) గుర్తింపు, వారి రిజిస్ట్రేషన్ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది. ఎంఎంసీ హెల్త్, శానిటేషన్ విభాగం అదనపు కమిషనర్ రఘు ప్రసాద్, కాప్రా సర్కిల్ స్థానిక డిప్యూటీ కమిషనర్ రవీంద్ర సాగర్‌తో కలిసి గురువారం ఈ ప్రత్యేక రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించారు. కార్యక్రమంలో కాప్రా సర్కిల్ డీఈ, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ రవి, శానిటరీ సూపర్‌వైజర్ సుదర్శన్, జవాన్ రామకృష్ణ, ఎస్ఎఫ్ఏలు మంజుల, శిరీష, రామ్‌కి సంస్థ నిర్వాహకులు క్లస్టర్ ఇన్‌చార్జి వేణు, ఉప్పల్ జోనల్ ఇన్‌చార్జి కృష్ణ, సర్కిల్ ఇన్‌చార్జి నవీన్ కుమార్ రెడ్డి, ఉప్పల్ జోన్ బల్క్ వేస్ట్ కలెక్షన్ హెడ్ శ్రీకాంత్ రెడ్డి, ఐలయ్య, సూపర్‌వైజర్ శృతి పాల్గొన్నారు.
అసలు ఎవరు ఈ బల్క్ వేస్ట్ జనరేటర్లు..?
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ రూల్స్ 2026 ప్రకారం వ్యర్థాల పరిమాణం రోజుకు 100 కిలోల కన్నా ఎక్కువ ఘన వ్యర్థాలను ఉత్పత్తి చేసే సంస్థలు, విస్తీర్ణం 20 వేల చదరపు మీటర్ల కన్నా ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న సముదాయాలు, నీటి వినియోగం రోజుకు 40 వేల లీటర్లకు పైగా నీటిని వినియోగించే సంస్థలు బల్క్ వేస్ట్ జనరేటర్ల కేటగిరీలోకి రానున్నాయి. నిబంధనల ప్రకారం నగరంలోని పెద్ద వ్యాపార, వాణిజ్య సంస్థలు, మల్టీఫ్లెక్స్‌లు, షాపింగ్ మాళ్లు, హోటళ్లు, పెద్ద ఆసుపత్రులు, ఐటీ పార్కులు, విద్యా సంస్థలు, పరిశ్రమలు, భారీ గేటెడ్ కమ్యూనిటీలు/అపార్ట్‌మెంట్లు కచ్చితంగా ఈ పరిధిలోకి వస్తాయి.
రిజిస్ట్రేషన్ ఎక్కడ?.. ఎలా చేసుకోవాలి?
ఈ భారీ వ్యర్థాల ఉత్పత్తిదారులందరినీ ఒకే గొడుగు కిందికి తెస్తూ, వారిపై పర్యవేక్షణ ఉంచేందుకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఒక కేంద్రీకృత పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు-2026 ప్రకారం ఏర్పాటు చేసిన పోర్టల్ 2026 మే 31 నుంచి అందుబాటులోకి వచ్చింది. అర్హత గల సంస్థలన్నీ కచ్చితంగా https://swm.cpcb.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవాలి.
నిబంధనల అమలులో కఠినత్వం
ఈ ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు, 2026 కేవలం కాగితాలకే పరిమితం కాకుండా సుప్రీం కోర్టు అత్యంత నిశితంగా పర్యవేక్షిస్తోంది. సుప్రీం కోర్టు పర్యవేక్షణ కమిటీ దేశవ్యాప్తంగా ఈ నిబంధనల అమలును పర్యవేక్షించడానికి కేంద్ర పర్యావరణ, పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి శాఖల కార్యదర్శులు, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి సభ్యులుగా ఒక ఉన్నత స్థాయి మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రతి జిల్లా కలెక్టర్ తమ పరిధిలో అనధికారికంగా చెత్త తరలించే, పారబోసే వాహనాలపై కఠినమైన క్రిమినల్, పెనాల్టీ చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది.
మధ్యంతర నివేదికలకు గడువు
‘పర్యావరణాన్ని పరిరక్షించకుండా కేవలం సఫాయి కార్మికులే చెత్తను శుభ్రం చేయాలని కూర్చుంటే కుదరదు.. సమాజంలోని ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి.’ అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యర్థాల నిర్వహణ గడువులను చాలా సీరియస్‌గా తీసుకుంటోంది. ఆగస్టు 6, 2026 కల్లా మొదటి మధ్యంతర నివేదికను సమర్పించాలని కమిటీని ఆదేశించింది. ఈ నేపథ్యంలో మున్సిపల్ అధికారులు గడువు లోపల నగరంలోని అన్ని బల్క్ వేస్ట్ జనరేటర్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని తలపెట్టారు.
అసలు ఇది సాధ్యమేనా..?
కేంద్ర పోర్టల్ మే 31 నుంచి అందుబాటులోకి వచ్చినందున, జూన్‌లో నగరంలోని ప్రధాన సంస్థలన్నీ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని అధికారులు ఆదేశిస్తున్నారు. అయితే ఈ నిబంధనల అమలుపై ప్రజల్లో, వ్యాపార వర్గాల్లో కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పెద్ద ఆసుపత్రులు, హోటళ్లు తమ పరిధిలో సొంతంగా వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకోవడానికి స్థలం ప్రధాన సమస్యగా మారే అవకాశం ఉంది. అయితే, మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో లేదా గుర్తింపు పొందిన థర్డ్ పార్టీ ఏజెన్సీల ద్వారా చెత్తను తరలించే వెసులుబాటు ఉండటం వల్ల ఇది ఆచరణలో సాధ్యమేనని అధికారులు చెప్తున్నారు.






