కదులుతున్న మంచుకొండ.. ప్రమాదంలో సముద్ర జీవాలు

by  |
కదులుతున్న మంచుకొండ.. ప్రమాదంలో సముద్ర జీవాలు
X

దిశ, వెబ్‌డెస్క్: మానవుల అనాలోచిత చర్యల వల్ల భారీస్థాయిలో గ్రీన్ హౌస్ వాయువుల విడుదలవుతుండగా, భూమ్మీద ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు ఎప్పట్నుంచో చెబుతూనే ఉన్నారు. ఈ వేడి కారణంగానే గ్రీన్‌లాండ్, అంటార్కిటికాల్లో ఉన్న మంచుదిబ్బలు గణనీయ స్థాయిలో కరిగిపోతూ సముద్ర మట్టాలు పెరుగుతున్న విషయమూ తెలిసిందే. కాగా 2017, జులైలో 5800 స్కేర్ కిలోమీటర్ల పరిమాణంతో ఉన్న ఓ మంచుకొండ అంటార్కిటికాలోని ‘లార్సెన్ సీ’ అనే ఐస్ షెల్ఫ్ నుంచి విడిపోగా, ప్రస్తుతం అది రెండు ముక్కలుగా విడిపోయింది. అందులో 2600 స్కేర్ కిలోమీటర్ల పరిమాణంతో ఉన్న ఐస్ బెర్గ్‌ను ‘ఏ68ఏ’ గా పిలుస్తుండగా, మరో మంచుదిబ్బను ఏ68ఎఫ్‌గా పిలుస్తున్నారు. అయితే ప్రపంచంలోనే భారీ సైజు గల మంచు కొండ ఏ68ఏ దక్షిణ జార్జియాలోని సబ్ అంటార్కిటిక్ దీవివైపు ప్రయాణిస్తుండటంతో ప్రకృతి ప్రేమికులతో పాటు, శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఆ మంచుకొండకు ఎందుకు భయపడుతున్నారు? దాని వల్ల ఎలాంటి ముప్పు పొంచి ఉంది?

మంచుదిబ్బలు ముక్కలుగా విడిపోవడానికి వాతావరణ మార్పులేవి కారణం కాకపోయినా, ఇది అంటార్కిటికాలో ఉష్ణోగ్రతలు పెరగడాన్ని సూచిస్తున్నాయని పరిశోధకులు భావిస్తున్నారు. అయితే సబ్ అంటార్కిటిక్ ద్వీపం వైపు ప్రయాణిస్తున్న ‘ఏ68ఏ’ మంచుకొండ.. ఒకవేళ ఆ దీవిని ఢీ కొట్టినా లేదా అక్కడే నిలిచిపోయినా.. ఆ ప్రాంతంలో ఉండే పెంగ్విన్స్, సీ లయన్స్ వంటి జీవులతో పాటు ఇతర సముద్ర జీవులకు ప్రమాదకరంగా మారనుంది. ఆయా సముద్ర జీవులు ఆహారం కోసం సుదూర ప్రాంతాలకు ప్రయాణించాల్సి ఉంటుందని, ఈ క్రమంలో అవి ఆకలితో చనిపోయే ప్రమాదం ఉందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఏ68ఏ దిబ్బపై బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వే (బీఏఎస్)కు చెందిన పరిశోధకులు వచ్చే నెల నుంచి అధ్యయనం ప్రారంభించనున్నారు. అయితే పెద్ద మంచుకొండ నుంచి ఏ68ఏ, ఏ68ఎఫ్ విడిపోయినట్లుగానే, ఇవి కూడా అధిక ఉష్ణోగ్రతల కారణంగా ముక్కలుగా విడిపోయే అవకాశం కూడా ఉందని పరిశోధకులు భావిస్తున్నారు.


Next Story

Most Viewed