అమెరికాకు ఆ పరిస్థితి ఎందుకు?

by  |
అమెరికాకు ఆ పరిస్థితి ఎందుకు?
X

దిశ, వెబ్‌డెస్క్:
సాధారణంగా హాలీవుడ్ సినిమాల్లో గ్రహాంతరవాసులు, వైరస్‌లు అమెరికా మీదనే దాడి చేస్తుంటాయి. అయితే వాటిని వాళ్లు తెలివిగా ఎదుర్కుంటారు. వేరే దేశాల వాళ్ల సాయం కొద్దిగా తీసుకుంటారనుకోండి… కానీ నిజజీవితంలో అమెరికా విషయంలో సీను రివర్స్ అయింది. అగ్రరాజ్యం అంటూ గొప్పలు చెప్పుకునే ఆ దేశం కరోనా తాకిడికి విలవిలలాడుతోంది. అక్కడ మొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదై దాదాపు మూడు నెలలు కావొస్తుంది. ఇంకా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గట్లేదు. ఆదివారం నాటికి 9,56,375 పాజిటివ్ కేసులు, 1,02,340 రికవరీలు, 53,928 మరణాలు అమెరికాలో సంభవించాయి. మరి దీనంతటికి కారణం? చెప్పుకుంటూ పోతే చాలా కనిపిస్తాయి. వాటిలో కొన్ని మాత్రం మనం చర్చించుకుందాం.

మెడికల్ సామాగ్రి కొరత

మాస్కులు, గ్లోవ్‌లు, గౌన్లు, వెంటిలేటర్లు. డాక్టర్లు, హాస్పిటళ్లు అందుబాటులో ఉన్నప్పటికీ వారికి రక్షణ కల్పించే మెడికల్ సామాగ్రి కొరత ఉండటంతో ఈ వైరస్ ఉధృతి పెరిగింది. వాడిన వాటినే వాడటం, నాణ్యత లేని సొంత మాస్కులను తయారు చేసుకోవడం వల్ల వైరస్‌ను అడ్డుకోలేకపోయారు. ఇలాంటి మహమ్మారి కోసం మెడికల్ సామాగ్రిని ముందుగా జాగ్రత్తగా చేసుకోకపోవడం గురించి అమెరికా ప్రభుత్వం తీవ్రవిమర్శలు ఎదుర్కొంది. ఒకానొక సమయంలో మెడికల్ సామాగ్రి లేక వ్యాధి వ్యాప్తిని అడ్డుకోని పరిస్థితి ఏర్పడి డాక్టర్ల కళ్లముందే వైరస్ ప్రసరించడాన్ని చూసిన సంఘటనలు కూడా ఉన్నాయి.

పరీక్షలు చేయడంలో ఆలస్యం

ప్రొఫెసర్ లెవీ చెప్పిన దాని ప్రకారం సింగపూర్, దక్షిణ కొరియా దేశాల్లో పెద్దమొత్తాల్లో వేగంగా పరీక్షల నిర్వహించడమే ఆయా దేశాల్లో వైరస్ వ్యాప్తి నియంత్రణలోకి వచ్చింది. కానీ అమెరికా ఈ పని చేయలేకపోయింది. ఇలాంటి పాండమిక్ సమయంలో వైరస్ ఎక్కడి నుంచి వ్యాపిస్తోంది, ఎంతమందికి వ్యాపించింది, ఏ దారిలో ప్రయాణిస్తోందనే సమాచారం చాలా ముఖ్యం. అయితే అమెరికాలో ఇలాంటి డేటాను సేకరించకుండా వైద్యులు ట్రీట్‌మెంట్లు చేసుకుంటూ వెళ్లడంతో వైరస్ చాప కింద నీరులా వ్యాపించింది.

ట్రంప్ వ్యాఖ్యలు

ప్రెస్‌మీట్లలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా వైరస్ గురించి మాట్లాడిన మాటలు ఆయన ఈ వైరస్‌ని కట్టడి చేయడంలో అసమర్థుడిగా ముద్రపడేలా చేశాయి. అంతేకాకుండా హైడ్రాక్సీక్లోరోక్విన్ కొరత కూడా అమెరికా ప్రజల్లో భయాన్ని రగిలించింది.

సామాజిక దూరం పాటించడంలో వైఫల్యం

సాధారణంగా అమెరికాలో ఉండే వాళ్లకి ఒకరు చెప్తే ఎందుకు వినాలనే ఆటిట్యూడ్ ఉంటుంది. ముఖ్యంగా కాలేజీ స్టూడెంట్లకు. అక్కడ కాస్తో కూస్తో భయపడేదంటే ఇమ్మిగ్రెంట్స్ మాత్రమే. వాళ్లందరూ ఈ వైరస్ కూడా ఒక పొలిటికల్ స్టంట్‌గా భావించి సామాజిక దూరం పాటించాలనే నిబంధనను బేఖాతరు చేశారు. విచ్చలవిడిగా పార్టీలు, హాలీడేలు చేసుకున్నారు. దీంతో వ్యాధి వ్యాప్తి పెరిగింది. పాజిటివ్ కేసులు 5 లక్షలు దాటితే గానీ వాళ్లలో సీరియస్‌నెస్ రాలేదు.

ఏదేమైనా సినిమాల్లో చూపించినంత గొప్పగా అమెరికా అగ్రరాజ్యం సమర్థమైనది కాదని ఈ పాండమిక్ వల్ల ప్రపంచ దేశాలకు అర్థమైంది. దేశంలో పాజిటివ్ కేసులను తగ్గించడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకుండా, దీనంతటికీ కారణమైన చైనా మీద పగ తీర్చుకుంటాం, సాయం చేయకపోతే గుర్తుపెట్టుకుంటాం లాంటివి అనడం వారి తెలివితక్కువతనానికి నిదర్శనమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Tags: America, corona, covid, social distance, lockdown, ventilators


Next Story

Most Viewed