సంగారెడ్డి జిల్లాలో "మెఫీడ్రోన్"డ్రగ్స్ స్వాధీనం

by Batti.Sumithra |

సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలో భారీ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టయింది.

సంగారెడ్డి జిల్లాలో మెఫీడ్రోన్డ్రగ్స్ స్వాధీనం
X

దిశ, జహీరాబాద్ : సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలో భారీ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టయింది. మండలంలోని మారుమూల ప్రాంతమైన పీచరేగడి తాండ పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న నిషేధిత "మెఫీడ్రోన్"డ్రగ్స్ మత్తు పదార్థాల తయారీ కేంద్రాన్ని ముంబై పోలీసులు బుధవారం రాత్రి ఆకస్మిక దాడి చేసి బట్టబయలు చేశారు. ఈ దాడిలో రూ. 6.5 కోట్ల విలువైన 3 కేజీల నిషేధిత డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ తయారు చేస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి ముంబైకి తరలించారు.

వ్యవసాయ పొలమే స్థావరం..

ముంబైకి చెందిన ఈ ముఠా తమ డ్రగ్స్ తయారీ స్థావరాన్ని సంగారెడ్డి జిల్లాలోని మారుమూల తాండ ప్రాంతానికి మార్చడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పీచరేగడి తాండ పరిధిలోని ఒక వ్యవసాయ పొలాన్ని ఎంచుకుని, ఎవరికీ అనుమానం రాకుండా వీరు ఈ దందా సాగిస్తున్నారు. గ్రామీణ ప్రాంతంలో, అదీ ఒక వ్యవసాయ పొలంలో ల్యాబ్ పేరుతో డ్రగ్స్ ఫ్యాక్టరీ వెలిసిన ఉదంతం స్థానిక ప్రజలను తీవ్ర కలకలానికి గురిచేసింది.

అధికారులకు తెలియకుండానే ఆపరేషన్ !

ఈ దాడికి సంబంధించిన మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. డ్రగ్స్ తయారు చేస్తున్న దుండగులు, వారిని పట్టుకున్న పోలీసులు ఇద్దరూ ముంబైకి చెందిన వారే కావడం గమనార్హం. నమ్మదగిన సమాచారంతో ముంబై పోలీసులు నేరుగా వచ్చి ఈ నిఘా ఆపరేషన్ చేపట్టారు. ఈ విషయమై స్థానిక పోలీసులకు గానీ, ఎక్సైజ్ శాఖ అధికారులకు గానీ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే ముంబై పోలీసులు అత్యంత రహస్యంగా ఈ దాడులు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పట్టుబడిన డ్రగ్స్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు రూ. 6.5 కోట్లు ఉంటుందని అంచనా. ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన ముంబై పోలీసులు, తదుపరి విచారణ నిమిత్తం వారిని ముంబైకి తరలించారు. ఈ ఘటనతో ఉమ్మడి మెదక్ జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో డ్రగ్స్ మాఫియా నెట్‌వర్క్ ఎంతలా విస్తరించిందో అర్థమవుతోంది. నెట్వర్క్ లో ఎవరెవరున్నది? స్థానికులు ఎవరికైనా ప్రమేయం ఉందా? అనేది విచారణ అనంతరమే స్పష్టం కానుంది.

Next Story