- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తుంగకుంటలో అక్రమ మట్టి దందా
కనగల్ మండలంలోని ధర్వేశిపురం గ్రామంలో ఉన్న తుంగకుంటలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

దిశ, కనగల్ : కనగల్ మండలంలోని ధర్వేశిపురం గ్రామంలో ఉన్న తుంగకుంటలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గతవారం రోజులుగా రాత్రి 10 గంటల తర్వాత జేసీబీల సహాయంతో కుంటలో మట్టిని తవ్వి ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. లక్షల రూపాయల విలువ చేసే మట్టిని రాత్రి వేళల్లో అక్రమంగా తరలిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు.
గ్రామ జనావాసాలకు సమీపంలో ఉన్న ఈ తుంగకుంట వద్ద గ్రామ ప్రజలు, చిన్నపిల్లలు, వృద్ధులు తరచూ రాకపోకలు సాగిస్తుంటారు. అయితే జేసీబీలతో సుమారు 10 నుంచి 15 ఫీట్ల లోతు వరకు మట్టిని తవ్వడంతో భారీ గుంతలు ఏర్పడ్డాయి. దీంతో ఎప్పుడైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా తుంగకుంటకు సమీపంలో వైన్స్ షాప్ ఉండటంతో, సమీపంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయానికి వచ్చే కొందరు భక్తులు మద్యం కొనుగోలు చేసి కుంట పరిసర ప్రాంతాల్లో సేవిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. మద్యం మత్తులో ఉన్న వ్యక్తులు జేసీబీలతో తవ్విన లోతైన గుంతల్లో పడిపోయి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో ఈ గుంతల్లో నీరు నిల్వ ఉండి ప్రమాద తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
గ్రామపంచాయతీ అధికారులకు పలుమార్లు సమాచారం అందించినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ భూమిని అక్రమంగా తవ్వి లక్షల రూపాయల విలువైన మట్టిని తరలిస్తున్న వారిపై రెవెన్యూ, గనుల శాఖ, పంచాయతీ అధికారులు వెంటనే విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని, తవ్విన గుంతలను పూడ్చివేసి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
తుంగకుంటలో అక్రమ మట్టి తవ్వకాలు ప్రాణాపాయం పొంచి ఉంది... పాలకూరి సాయి బాబా ధర్వేశిపురం గ్రామస్థుడు.
"ధర్వేశిపురం గ్రామంలోని తుంగకుంటలో ఎలాంటి అనుమతులు లేకుండా రాత్రి వేళల్లో జేసీబీలతో మట్టిని తవ్వి ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. దీంతో కుంటలో భారీ గుంతలు ఏర్పడ్డాయి. గ్రామ ప్రజలు, చిన్నపిల్లలు, వృద్ధులు తరచూ ఈ ప్రాంతానికి వస్తుంటారు. సమీపంలో వైన్స్ షాప్ ఉండటంతో కొందరు మద్యం సేవించి కుంట పరిసరాల్లో తిరుగుతుంటారు. మద్యం మత్తులో ఈ లోతైన గుంతల్లో పడితే ప్రాణాపాయం జరిగే ప్రమాదం ఉంది.అధికారులు వెంటనే స్పందించి అక్రమ మట్టి తవ్వకాలను నిలిపివేసి, తవ్విన గుంతలను పూడ్చివేసి గ్రామ ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలి."






