ఈటలపై పోటీ.. హుజురాబాద్‌లో​ ఇంకా ఎవరైనా ఉన్నారా..?

by  |
ఈటలపై పోటీ.. హుజురాబాద్‌లో​ ఇంకా ఎవరైనా ఉన్నారా..?
X

దిశ, తెలంగాణ బ్యూరో : హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రధాన పార్టీల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. పాదయాత్రతో ఇప్పటికే బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్​ గ్రామాలను చుట్టుముడుతున్నారు. అధికార టీఆర్‌ఎస్​ మాత్రం ఇంకా అభ్యర్థిని ప్రకటించకుండానే పథకాల పేరుతో ఓట్లకు గాలం వేస్తోంది. ఇక్కడి నుంచి ఎవరిని నిలబెడుతారనేది ఇంకా పార్టీలో ఎవరికీ తెలియని రహస్యం. కానీ అభ్యర్థి అనేది కాకుండా పార్టీ, సంక్షేమ పథకాలు, కేసీఆర్​పేరు మీద మాత్రమే గెలవాలనే తీరుతో టీఆర్‌ఎస్​ పావులు కదుపుతోంది. దీనిలో భాగంగా ఇతర పార్టీల నేతలపై దృష్టి పెట్టింది. ఆయా పార్టీల నుంచి వలస వచ్చిన నేతలకే టికెట్ ఖరారు చేస్తారని గులాబీ శ్రేణుల్లో ప్రచారం జరుగుతోంది.

రెండింటా అంతే..

మంత్రివర్గం నుంచి ఈటల బర్తరఫ్​తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో హుజురాబాద్​ఉప ఎన్నిక అనివార్యమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు బీజేపీ నుంచి పోటీ చేస్తున్న ఈటల రాజేందర్​కూడా వలస నేత అన్నట్టే. మొన్నటి వరకు టీఆర్‌ఎస్‌లో ఉండి అధినేతతో విభేదించి బీజేపీలో చేరారు. దీంతో ఆయన బీజేపీకి వలస నేతగానే చెప్పుకుంటున్నారు.

అధికార టీఆర్‌ఎస్​ పార్టీ ఇప్పటి వరకూ అభ్యర్థిని ఖరారు చేయడం లేదు. కానీ హుజురాబాద్​వేదికగా దళిత బంధు అంటూ నూతన పథకాన్ని ఆవిష్కరిస్తోంది. గొర్రెలు, పింఛన్ల పంపిణీ, రేషన్​కార్డులు అంటూ సంక్షేమ పథకాలను కేటాయిస్తోంది. సీసీ రోడ్లు, గ్రామ పంచాయతీ భవనాలు అంటూ నిధులు కేటాయించింది. ఈటలకు అండగా ఉన్న అక్కడి నేతలకు పదవులు కూడా ఇచ్చింది. కానీ ఇంకా అభ్యర్థి ఎవరనేది మాత్రం తేల్చడం లేదు. అయితే పోటీ పడే అభ్యర్థులు జాబితా మాత్రం చాంతాండంత ఉంటోంది. వారంతా ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరినవారే కావడం గమనార్హం. మాజీ మంత్రులు ఎల్​. రమణ, ఇనుగాల పెద్దిరెడ్డి, కాంగ్రెస్​నేత కౌశిక్​రెడ్డి, మాజీ మంత్రి సతీమణి మాలతీరెడ్డి, తనయుడు కశ్యప్​రెడ్డి, ముద్దసాని దామోదర్​రెడ్డి, కాంగ్రెస్​ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరినట్లు ప్రకటించిన స్వర్గం రవితో పాటు పలువురు నేతలు వలస నేతలే. వీరిలో ఎవరికి టికెట్​ఇచ్చినా ఇతర పార్టీ నేతలపైనే ఆధారపడ్డారనే ఆరోపణలు ఎదుర్కొవాల్సి వస్తోంది.

కాంగ్రెస్‌కు కష్టమేనా..?

ప్రస్తుతం కాంగ్రెస్‌కు హుజురాబాద్‌లో గడ్డు పరిస్థితి నెలకొంది. కౌశిక్​రెడ్డి రాజీనామాతో ఇక్కడ ఎవరిని నిలబెట్టాలనే ప్రశ్న రాష్ట్ర నాయకత్వాన్ని వేధిస్తోంది. దీనిపై దామోదర రాజనర్సింహా క్షేత్రస్థాయి నుంచి అభిప్రాయాలు సైతం తీసుకుంటున్నారు. కానీ ఇక్కడ పోటీ బీజేపీ వర్సెస్​ టీఆర్‌ఎస్​ మాత్రమేనని, కాంగ్రెస్​ మూడో స్థానానికే పరిమితమనే ప్రచారం సాగుతోంది. గత ఎన్నికల్లో ఈటలపై కాంగ్రెస్​నుంచి పోటీ చేసిన కౌశిక్​రెడ్డి 61 వేల ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. కానీ ఈసారి ఆయన టీఆర్‌ఎస్‌లో చేరాడు. దీంతో కాంగ్రెస్​ నుంచి ఎవరు బరిలోకి దిగుతారనేది అక్కడి పార్టీ నేతలకు కూడా క్లారిటీ లేదు. పెద్దిరెడ్డి బీజేపీకి రాజీనామా చేయడంతో ఆయన కాంగ్రెస్‌లో చేరి, హుజురాబాద్​నుంచి పోటీ చేస్తారని ఆశించారు. కానీ ఆయన టీఆర్‌ఎస్‌కు వెళ్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇక్కడి నుంచి ఎవరు పోటీ చేస్తారనే సందిగ్థం వీడటం లేదు.



Next Story

Most Viewed