- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లక్షణాలు కనిపించవు కానీ వెరీ డేంజర్.. రక్తంలో ఈ స్థాయిలు పెరిగితే బీ కేర్‌ఫుల్!
అధిక లిపిడ్స్ రక్త నాళాలలో ఫలకాలు ఏర్పడేలా చేసి, రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటాయి. గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాలను పెంచుతాయి.

దిశ, ఫీచర్స్ : మీకు తెలుసా? భారత దేశంలోని ప్రతీ 10 మందిలో 9 మందికి రక్తంలో లిపిడ్స్(కొవ్వు పదార్థాలు)స్థాయి అసాధారణంగా ఉంటున్నాయి. దీనివల్ల బాధితుల్లో గుండెపోటు, స్ట్రోక్, పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్, కొరోనరీ ఆర్టరీ డిసీజ్, దీర్ఘకాలికంగా గుండె వైఫల్యం వంటి తీవ్రమైన వ్యాధుల రిస్క్ పెరుగుతోందని ఐసీఎంఆర్ (ICMR) నివేదిక చెబుతోంది. కాబట్టి ప్రజలు ఆరోగ్యంపట్ల జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ లిపిడ్స్ అంటే ఏమిటి? ఎందుకు పెరుగుతుంది? ఎలాంటి కేర్ తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
లిపిడ్స్ అంటే?
వైద్య నిపుణుల ప్రకారం.. లిపిడ్స్ అంటే రక్తంలోని కొలెస్ట్రాల్ & ట్రైగ్లిసరైడ్స్. ఇందులో “చెడు” కొలెస్ట్రాల్ (LDL) ఎక్కువగా ఉండటం, “మంచి” కొలెస్ట్రాల్ (HDL) తక్కువగా ఉండటం లేదా ట్రైగ్లిసరైడ్స్ అధికం కావడం వంటివి అసాధారణ స్థాయిలు. ఇవి సాధారణంగా ఎలాంటి లక్షణాలు చూపవు, కాబట్టి చాలా మందికి తెలియకుండానే ప్రమాదం పెరుగుతోంది. అయితే ఈ సమస్యకు ప్రధాన కారణాలు ఏమిటంటే.. ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులే అంటున్నారు నిపుణులు.
ఎందుకు పెరుగుతాయి?
ముఖ్యంగా డీప్ ఫ్రై చేసిన, ప్రాసెస్డ్ ఆహారాలు ఎక్కువగా తినడం, కూర్చొని పని చేసే సెడెంటరీ లైఫ్‌స్టైల్, డెస్క్ జాబ్స్, ఒత్తిడి, నిద్రలేమి వంటివి రక్తంలో కొవ్వు పదార్థాలు పెరగానికి ప్రధాన కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు ఊబకాయం, డయాబెటిస్, థైరాయిడ్ సమస్యలు, జన్యుపరమైన కారణాలు (కొంతమందికి వంశపారంపర్యం)అధిక మద్యపానం, స్మోకింగ్ వంటి అలవాట్లు కూడా రక్తంలో లిపిడ్స్ పెరగడానికి దారితీస్తాయి.
ఏం జరుగుతుంది?
అధిక లిపిడ్స్ రక్త నాళాలలో ఫలకాలు (ప్లాక్) ఏర్పడేలా చేసి, రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటాయి. దీంతో గుండెపోటు, స్ట్రోక్ (మెదడు రక్త నాళాలు బ్లాక్), పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్, కొరోనరీ ఆర్టరీ డిసీజ్, దీర్ఘకాలికంగా గుండె వైఫల్యం వంటి ఆరోగ్య సమస్యల ముప్పు పెరుగుతుంది. కాగా లక్షణాలు బయటకు కనిపించకపోవడం వల్ల చాలా మంది తమకు తెలియకుండానే దీనిబారిన పడుతున్నారు. ముందే సమస్యను గుర్తిస్తే గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రమాదాల నుంచి కాపాడుకోవచ్చునని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఏం చేయాలి?
రక్తంలో కొవ్వు పదార్థాలు పెరగకుండా ఉండాలంటే.. ఆరోగ్యకరమైన జీవనశైలిని, ఆహారపు అలవాట్లను అనుసరించడం చాలా ముఖ్యం అంటున్నారు వైద్య నిపుణులు. ముఖ్యంగా ఫ్రైడ్ ఫుడ్స్, మిఠాయిలు, ప్రాసెస్డ్ మీట్స్ తగ్గించి, కూరగాయలు, పండ్లు, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఫైబర్ వంటివి ఎక్కువగా తినాలి. ఆలీవ్ ఆయిల్, నట్స్ కూడా మంచివి. దీంతోపాటు రోజుకు కనీసం 30-45 నిమిషాలు స్పీడ్ వాకింగ్, జాగింగ్ లేదా వ్యాయామం చేయడం ఉత్తమం. అలాగే అధిక బరువు నియంత్రణ, స్ట్రెస్ తగ్గించడం,7-8 గంటల నిద్ర, స్మోకింగ్ & మద్యం మానేయడం మంచిది. ఇక రక్తంలో కొవ్వు పదార్థాలు పెరిగాయో ముందుగానే తెలియదు కాబట్టి 30 ఏళ్లు పైబడిన వారు ఆర్నెల్లకో, ఏడాదికో ఒకసారి హెల్త్ చెకప్‌లు చేయించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక సమస్యల బారిన పడకుండా జాత్రత్త పడవచ్చునని చెబుతున్నారు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.






