భాగ్యనగరంలో అభివృద్ధేది..?

by  |
భాగ్యనగరంలో అభివృద్ధేది..?
X

దిశ, శేరిలింగంపల్లి: కాలనీల్లో ఎక్కడికక్కడ తవ్విన రోడ్లు.. పొంగిపొర్లుతున్న నాలాలు.. చెత్తతో నిండిన పరిసరాలు ఇదే మన ప్రజాప్రతినిధులు రూ.వేల కోట్లతో చేసిన అభివృద్ధి. పలు కాలనీల్లో ఎక్కడి సమస్యలు అక్కడే తిష్ట వేశాయి. పైపై మెరుగులే తప్పా క్షేత్రస్థాయిలో ప్రభుత్వం చెబుతున్న అభివృద్ధి కనుచూపు మేరలో కనిపించడం లేదు. సమస్యలున్నాయని మొత్తుకున్న పట్టించుకునే నాథుడే లేడని జనాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో స్వయంగా మంత్రి గారు మాటిస్తేనే దిక్కులేదని, ఇప్పుడు తమ తప్పు కప్పి పుచ్చుకునేందుకు అభ్యర్థిని మార్చి జనాలను ఏమార్చడమే కానీ, అధికార పార్టీ నాయకులు అభివృద్ధి చేస్తారా..? అని ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.

మంత్రి గారూ.. మాట తప్పారు..

గ్రేటర్ లో ప్రముఖ ప్రాంతాల్లో కేపీహెచ్ బీ ఒకటి. దీని పక్కనే ఉంటుంది హైదర్‎నగర్ డివిజన్. కేపీహెచ్‎బీలో సగం ఈ డివిజన్ పరిధిలోనే ఉంది. కానీ ఇక్కడ అభివృద్ధి శూన్యం. చాలా కాలనీల్లో తవ్వేసిన రోడ్లు, రోడ్లపై పొంగి పొర్లుతున్న నాలాలు, చెత్తతో నిండిన పరిసరాలతో సాధారణ గ్రామీణ పట్టణాన్ని తలపిస్తుంది హైదర్‎నగర్ ప్రాంతం. గత ఎన్నికల్లో ఈ డివిజన్ నుంచి టీఆర్ఎస్ నుంచి బరిలో నిలిచిన జానకీరామ్‎ను గెలిపిస్తే తానే దత్తత తీసుకుని నగరంలో ఎక్కడాలేని విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. మంత్రిగారి మాటలు నమ్మిన జనం ఆ పార్టీ అభ్యర్థిని గెలిపించారు. కానీ మంత్రి గారు మాత్రం ఇచ్చిన మాట మరిచారు.

అభివృద్ధి పట్టలే..

హైదర్‎నగర్ డివిజన్‎లో స్వచ్ఛమైన నీటితో కళకళలాడిన చెరువులు నేడు మురుగుతో నిండి దుర్వాసనను వెదజల్లుతున్నాయి. డివిజన్‎లోని అలీ చెరువు విస్తీర్ణం 2001 రెవెన్యూ అధికారిక రికార్డుల ప్రకారం 15 ఎకరాలు. కానీ కబ్జా రాయుళ్ల కబంధ హస్తాల్లో చిక్కి 3 ఎకరాలకు కుంచించుకు పోయింది. ఈపాపం అధికార పార్టీ నాయకులదేనని స్థానికులు ఆరోపిస్తున్నారు. డివిజన్‎లోని మరికొన్ని చెరువులు కూడా ఇలాగే కబ్జాకు గురయ్యాయి. ఎమ్మెల్యే గాంధీ కొన్ని చెరువులను అభివృద్ధి చేస్తున్నా.. ఆయనకు అలీ చెరువు అంటే ఎందుకు గిట్టదో అర్ధం కావడం లేదని స్థానికులు వాపోతున్నారు.

శిథిలమైన స్కూల్.. అధికారిలేని ఆస్పత్రి..

డివిజన్‎లోని ప్రభుత్వ పాఠశాల ముందు చెత్త పేరుకు పోయి అధ్వానంగా మారింది. సిబ్బంది రోజుల తరబడి ఇక్కడి చెత్తను తొలగించడం లేదు. దీంతో ఈదారి మొత్తం దుర్వాసన వ్యాపిస్తోంది. స్కూల్ బిల్డింగ్ కూడా శిథిలమై ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. కమ్యూనిటీ హాల్‎లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలో ఎప్పుడు చూసినా ఒక్క వైద్యాధికారి ఉండరు. ఎప్పుడు చూసినా తాళం కప్ప వేలాడుతూనే ఉంటుంది. దీనితో ఏ ప్రయోజనం లేదని స్థానికులు మండిపడుతున్నారు.

ఫుట్ ఓవర్ బ్రిడ్జి కోసం ఎదురుచూపులు..

హైదర్‎నగర్ మీదుగానే వెళ్తున్న ముంబై నేషనల్ హైవేపై వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ రోడ్డు దాటాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దాటాల్సిందే. ఈ సమస్యపై సంబంధిత అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జిని నిర్మించాలని కోరినా పట్టడం లేదని, ఇక సమస్యలు తీరుస్తామని హామీల వర్షం కురిపించడమే కానీ తరువాత ఇటు వైపు కూడా చూడరంటూ జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదర్‎నగర్ డివిజన్ ప్రజల్లో అధికార పార్టీ పై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో డివిజన్ ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారు వేచి చూడాల్సింది.

ప్రజలను ఏమార్చడం అలవాటైంది..

గెలవడానికి ముందు అభివృద్ధి చేస్తామంటారు.. గెలిచిన తరువాత పట్టించుకోరు. మళ్లీ ఎన్నికలొచ్చే సరికి ఇప్పుడు తప్పకుండా చేస్తమంటూ జనాలను ఏమార్చడం నాయకులకు అలవాటుగా మారింది. ఆదర్శంగా తీర్చిదిద్దుతానని గతంలో స్వయంగా మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. కానీ, ఎక్కడా ఆ ఛాయలు కనిపించడం లేదు. అభివృద్ధి చేయనప్పుడు అభ్యర్థులు మారితే మాత్రం ఏం లాభం. మరోసారి నాయకుల మాటలు నమ్మి మోసపోలేం. అభివృద్ధి చేసే వారు మాత్రమే ఓట్లు అడగండి.

– నరేష్, స్థానికుడు

హైదరాబాద్ అభివృద్ధికి పునాది వేసింది మేము : చంద్రబాబు


Next Story