మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన ఫర్నిచర్ దుకాణాలు తొలగింపు

by Taduka Kalyani |

మియాపూర్ ప్రధాన రహదారికి ఆనుకుని మెట్రో స్టేషన్ న్యూ కాలనీ సమీపంలో అక్రమంగా ఏర్పాటు చేసిన ఫర్నిచర్ షాపులను సీఎంసి అధికారులు తొలగించారు.

మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన ఫర్నిచర్ దుకాణాలు తొలగింపు
X

దిశ, శేరిలింగంపల్లి : మియాపూర్ ప్రధాన రహదారికి ఆనుకుని మెట్రో స్టేషన్ న్యూ కాలనీ సమీపంలో అక్రమంగా ఏర్పాటు చేసిన ఫర్నిచర్ షాపులను సీఎంసి అధికారులు తొలగించారు. ఉదయం 6 గంటల నుంచి రోడ్డు పక్కన ఉన్న ఫర్నిచర్ షాపులను సిఎంసి ,రెవెన్యూ అధికారులు భారీ పోలీసు బందోబస్తు నడుమ తొలగించారు. అయితే ఎలాంటి సమాచారం ఇవ్వకుండా షాపులను తొలగించారని, ఎన్నో ఏళ్ళుగా నివాసం ఉంటున్న గుడిసెలు తొలగించడం అన్యాయమని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన రహదారి పక్కనే కిలోమీటరు పొడవున సుమారు 90 ఫర్నిచర్ దుకాణాలు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క షాపులో 3 నుంచి 6 లక్షల రూపాయలు విలువైన ఫర్నిచర్ వస్తువులు ఉన్నాయని బాధితులు తెలిపారు. ఈ దుకాణాలు ఆధారంగా మూడు వందల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయాని, ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా దుకాణాలు కూల్చివేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎటువంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా భారీ పోలీసు బందోబస్తు మధ్య అక్రమాలను తొలగించారు. సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఫ్లైఓవర్ నిర్మాణం పనులకు శంకుస్థాపన ఉండడంతో తొలగించామని అధికారులు తెలిపారు. అయితే మియాపూర్ సర్వేనెంబర్ 28 గత కొద్ది కాలంగా కోర్టు వివాదంలో ఉంది.రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకపోయినా ఎలా తొలగించారంటూ బాధితులు నిలదీశారు. షాపులతోపాటు ఇక్కడే గుడిసెల్లో జీవిస్తున్నామని కనీసం ఒక్కరోజు కూడా సమయం ఇవ్వలేదని చిన్నపిల్లలతో రోడ్డును పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మాకు న్యాయం చేయాలని బాధితులు విజ్ఞప్తి చేశారు.ఉన్న పళంగా ఫర్నిచర్ వస్తువులతో ఎటు వెళ్ళాలో అంతుచిక్కడం లేదని,వడ్డీకి అప్పులు తెచ్చి వ్యాపారం నిర్వహిస్తున్నామని బాధితులు తెలిపారు.ప్రభుత్వం స్పందించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరారు.

Next Story