ఈసారి రైతుబంధు ఎప్పుడు వచ్చేనో..?

by  |
ఈసారి రైతుబంధు ఎప్పుడు వచ్చేనో..?
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో వానాకాలం వ్యవసాయానికి రైతులు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం యాసంగి కొనుగోళ్లు సాగుతున్నాయి. ఈ నెలాఖరు వరకు కొనుగోళ్లు పూర్తి అయిన తర్వాత రైతులు సాగు పనులకు సిద్ధం కానున్నారు. ఇక రైతుకు పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం ఇచ్చే రైతుబంధు సాయం ఈసారి కూడా ఆలస్యమవుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పథకం ప్రారంభంలో త్వరగా… అనుకున్న సమయానికే చెక్కులు ఇచ్చినా రానురానూ ఆలస్యమవుతోంది. అయితే ఇప్పుడు కూడా కరోనా పరిస్థితులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిస్తుండటంతో రైతుల్లో కొంత ఆందోళన మొదలైంది. కానీ గత ఏడాదిలాగానే కరోనా విపత్తు ఉన్నా సాయం చేస్తారనే భరోసాతో ఉంటున్నారు.

అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..

2018లో సీఎం కేసీఆర్​ ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన రైతుబంధు పథకంలో తొలినాళ్లలో మే నెల నుంచే చెక్కులు జారీ చేశారు. అప్పుడు మే 10 నాటికే రైతుల పేర్ల మీద చెక్కులు సిద్ధమై పంపిణీ చేశారు. ఆ తర్వాత 2019లో మాత్రం మే నెల మొదటివారంలోనే ప్రభుత్వం ప్రకటన చేసింది. రైతుబంధు సాయం చేస్తామని వెల్లడించారు. మే నెలాఖరు నుంచి చెక్కులను బ్యాంకులకు మళ్లించారు. అనంతరం 2020లో కరోనా పరిస్థితుల్లో కూడా జూన్​ వరకూ రైతుబంధు పంపిణీని వాయిదా వేసుకున్నారు. పంటల సాగు మొదలైన తర్వాత గతేడాది పెట్టుబడి సాయాన్ని ఇచ్చారు. జూన్​ 20 నుంచి రైతుల ఖాతాల్లో జమ చేశారు.

ఈసారి ఎప్పుడో..?

ఈసారి రైతుబంధు కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే కలిసొస్తున్న కాలంతో పంటలు వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈసారి కూడా ముందస్తుగానే వర్షాలు వస్తాయని, పుష్కలంగా వానలు ఉంటాయని వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో పలుచోట్ల రైతులు యాసంగి ధాన్యాన్ని అమ్మి, వానాకాలం కోసం సిద్ధమవుతున్నారు. ఈసారి రైతుబంధు పథకం కోసం రూ. 14,800 కోట్లను కేటాయించారు. అంతేకాకుండా గడిచిన మూడేళ్లలో రైతుబంధు కింద రూ. 35,911 కోట్లు రైతులకు సాయంగా ఇచ్చారు.

సాగు పెరుగుతోంది

మరోవైపు రాష్ట్రంలో అనుకూల పరిస్థితులు ఉండటంతో పంటల సాగు పెరుగుతోంది. గత ఏడాది వానాకాలంలో 1.34 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు చేయగా… ఈసారి 1.62 కోట్ల ఎకరాలకు పెరుగుతుందని వ్యవసాయ శాఖ సాగు ప్రణాళికలో స్పష్టం చేసింది. అంటే దాదాపు 28 లక్షల ఎకరాల్లో సాగు పెరుగనుంది. గత ఏడాది జనవరిలో సీసీఎల్ఏ వ్యవసాయ శాఖ భూ సమాచారం సేకరించింది. ఆ లెక్కల ప్రకారం రాష్ట్రంలో కోటి 47 లక్షల 66 వేల ఎకరాల పట్టా భూమి 59.30 లక్షల మంది రైతుల ఆధీనంలో ఉందని తేలింది. వీరితో పాటుగా 2.99 లక్షల ఎకరాలు ఆర్‌‌‌‌‌‌‌‌వోఎఫ్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ పట్టాభూమి 92 వేల మంది రైతులు కలిగి ఉన్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం మార్చిన నిబంధనల ప్రకారం వీరికి కూడా రైతుబంధు అందించారు.

అయితే ఈసారి సాగు భూమి గణనీయంగా పెరుగుతోంది. గత ఏడాది 1.47 కోట్ల ఎకరాలను వ్యవసాయ శాఖ సూచించగా… సాగు మాత్రం 1.34 కోట్ల ఎకరాల్లో జరిగింది. అయితే రైతుబంధు మాత్రం అందరికీ ఇచ్చారు. కానీ ఈ వానాకాలంలో మాత్రం సాగు 1.62 కోట్ల ఎకరాలకు పెరుగుతుందని అంచనా వేశారు. ఈ లెక్కల ప్రకారం రైతుబంధు సాయం పెంచాల్సి ఉంటోంది. మరోవైపు గత ఏడాదిలో వానాకాలం సీజన్‌‌‌‌‌‌‌‌కు ఎకరాకు రూ. 5 వేల చొప్పున కోటి 47 లక్షల 66వేల ఎకరాలకు రూ.7,352 కోట్లు పెట్టుబడి సాయం అవసరం అవుతుందని అంచనా వేశారు. అందుకు అనుగుణంగా ముందుగానే ప్రభుత్వం రూ. 7 వేల కోట్లకు అనుమతులిచ్చి రెండు విడుతల్లో వ్యవసాయ శాఖకు బదిలీ చేసింది. కానీ ఈసారి మాత్రం సాగు భూమి పెరుగుతుండటంతో రైతుబంధు సాయం కూడా పెంచాల్సి ఉంటుందని ప్రాథమికంగా నివేదికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

తగ్గుతూ… పెరుగుతూ..

2018 వానకాలం 50.25 లక్షల పట్టాదారులకు 1.30 కోట్ల ఎకరాల భూమి ఉండగా ఎకరాకు రూ.4 వేల చొప్పున రూ.5236 కోట్లు చెల్లించారు. యాసంగిలో 49.10 లక్షల పట్టాదారులకు 1.31 కోట్ల ఎకరాల భూమికి రూ.5248 కోట్లు రైతుల ఖాతాలకు జమ చేశారు. అలాగే 2019 వానకాలం సీజన్‌లో 51.61 లక్షల పట్టాదారుల 1.22 కోట్ల ఎకరాల భూమికి ఎకరాకు రూ.5 వేల చొప్పున రూ.6125 కోట్లు, యాసంగిలో 42.42 లక్షల పట్టాదారుల 88.13 లక్షల ఎకరాల భూమికి రూ. 4406 కోట్లు జమ చేశారు. గత ఏడాది వానాకాలం, యాసంగిలో 1.47 కోట్ల ఎకరా భూమి, 59.01 లక్షల మందికి రూ. 14 వేల కోట్లను రైతుబంధు సాయంగా పంపిణీ చేశారు.


Next Story

Most Viewed