- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మళ్లీ డీలిమిటేషన్ బిల్లు..వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే ఛాన్స్ !
కేంద్ర ప్రభుత్వం మరోసారి నియోజకవర్గాల పునర్విభజన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని యోచిస్తున్నది.

మళ్లీ డీలిమిటేషన్ బిల్లు!
- వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే యోచనలో కేంద్రం
దిశ, నేషనల్ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం మరోసారి నియోజకవర్గాల పునర్విభజన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని యోచిస్తున్నది. ఈ వర్షాకాల సమావేశాల్లో కొత్త డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని, ఇదివరకే ఇందుకోసం మద్దతును కూడగట్టే ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలిసింది. ప్రతిపక్ష పార్టీలతో సంప్రదింపులు మొదలుపెట్టిందని, ఆ పార్టీలూ సానుకూలంగా స్పందిస్తున్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ బిల్లును పార్టీల మధ్య రాజకీయ అంశంగా విడగొట్టకుండా వారి అభ్యంతరాలను పరిశీలించి, సర్దిచెప్పి మద్దతను కూడగడుతున్నట్టు చెబుతున్నారు. మొన్నటి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత మారిన పరిస్థితులు కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా మారనున్నాయి. అంశాలవారీగా ప్రతిపక్ష పార్టీల నుంచి మద్దతు లభించే అవకాశముంది. టీఎంసీ ఎంపీలు డీలిమిటేషన్ బిల్లుపై సానుకూలంగా స్పందించారని, డీఎంకే ఎంపీలు సైతం చర్చించడానికి సంసిద్ధతను వ్యక్తపరిచినట్టు ఆ వర్గాలు వివరించాయి. ఏప్రిల్ నెలలోనే ఈ మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులను కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టగా రాజ్యాంగ సవరణకు అవసరమైన మూడింట రెండో వంతు మద్దతును సాధించలేకపోయింది. సభకు హాజరైన మొత్తం 528 మంది సభ్యుల్లోత 298 మంది బిల్లులకు మద్దతునివ్వగా, 230 మంది వ్యతిరేకించారు. అవసరమైన 352 ఓట్లు రాకపోవడంతో బిల్లులు లోక్‌సభలో వీగిపోయాయి.
ప్రతిపక్షాల మద్దతుపై భరోసా
మొన్నటి బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీని ఓడించి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం, తమిళనాడులో టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడం.. డీఎంకేతో బంధాన్ని తుంచుకుని కాంగ్రెస్ పార్టీ విజయ్‌కు మద్దతుగా నిలవడం.. ఈ పరిణామాలు కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా మారుతున్నాయి. బెంగాల్‌లో టీఎంసీ పార్టీలో తిరుగుబాట్లు జరుగుతున్నాయి. మమతా బెనర్జీ సమ్మతం లేకుండా ప్రతిపక్ష నేతగా రితబ్రత బెనర్జీ ప్రకటన సంచలనమైంది. టీఎంసీ ఎంపీల్లోనూ ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతిస్తున్నవారి సంఖ్య పెరుగుతున్నట్టు సమాచారం. తమిళనాడులో కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందని అభిప్రాయపడిన డీఎంకే.. ఇండియా కూటమి నుంచి దూరంగా జరుగుతున్నది. డీలిమిటేషన్‌ను తీవ్రంగా వ్యతిరేకించిన డీఎంకే సైతం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తెచ్చే కొత్త డీలిమిటేషన్ బిల్లుపై చర్చించడానికి సంసిద్ధతను వ్యక్తం చేసినట్టు కీలకవర్గాలు వెల్లడించాయి. వీటితోపాటు ఎన్సీపీ(సునేత్రా పవర్ వర్గం), ఉద్ధవ్ ఠాక్రే శివసేన పార్టీ సహా ప్రాంతీయ పార్టీల నుంచీ అంశాల వారీగా మద్దతు వచ్చే అవకాశమున్నదని కేంద్రం భావిస్తున్నది. ఈ పార్టీలు డీలిమిటేషన్ బిల్లుకు ఆమోదం తెలిపితే కేంద్ర ప్రభుత్వ ప్రయత్నం సులువవుతుంది. పార్లమెంటకు హాజరై ఓటేయకున్నా.. ఆబ్సెంట్ కావడం వంటి పద్ధతుల్లో ఎన్డీయేకు ఈ పార్టీలు ఉపకరించవచ్చు.
2029లోపే అమలు చేయాలనే లక్ష్యం
2011 జనభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ చేపట్టాలని, తాజా జనగణనకు ముందే మహిళా బిల్లు అమలు చేయాలనే సవరణలకు మూడింట రెండో వంతు ఓట్లు అవసరమయ్యాయి. వేర్వేరుగా కాకుండా కలిపే బిల్లులను తెచ్చి ప్రతిపక్షాన్నీ మహిళా కోటాపై ఇరుకునపెట్టాలని కేంద్రం భావించింది. కానీ, అది కుదరకపోవడంతో ఇప్పుడు ప్రతిపక్షాల మద్దతును కూడగట్టాలని నిర్ణయించింది. డీలిమిటేషన్‌కు కొత్త బిల్లును ప్రవేశపెట్టే చాన్స్ ఉన్నది. తద్వార లోక్‌సభలో 543 సీట్ల నుంచి 850కు పెంచాలని భావిస్తున్నది. 850 సీట్లు పెంచినా 816 సీట్లను ఉపయోగించుకోవాలని యోచిస్తున్నట్టు తెలిసింది. ప్రతిరాష్ట్రంలో సీట్లు డబుల్ చేస్తే ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదని కేంద్రం వాదిస్తున్నది. ఇది వరకే భారీగా సీట్లున్న ఉత్తరాది రాష్ట్రాలకు ఇది ఉపయోగపడుతుందనే వాదనను ప్రతిపక్షాలు చేశాయి. ఈ డీలిమిటేషన్ ఆమోదం పొందితే దక్షిణాది రాష్ట్రాల నుంచి మద్దతులేకున్నా.. ఉత్తరాది రాష్ట్రాల ఎంపీల సంఖ్యతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే చాన్స్ ఉన్నది. ఇదే జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు లోక్‌సభలో బార్గెయినింగ్ శక్తి తగ్గుతుంది. మరోవైపు కేంద్రంలోని బీజేపీ ఈ బిల్లును 2029 లోక్‌సభ ఎన్నికల్లోపే క్లియర్ చేసుకుని అమలు చేయాలని భావిస్తున్నదని విశ్లేషిస్తున్నారు. కాగా, అధికార వర్గాలు మాత్రం కేవలం మహిళా సీట్లను అకామడేట్ చేయడానికే పునర్విభజన ఇప్పుడు చేస్తున్నట్టు వివరించాయి.






