ఆ జిల్లాలో ఫోన్‌ ట్యాపింగ్‌ కలకలం..బీఆర్‌ఎస్‌లో టెన్షన్‌!

by velandi.Saikiran |   (  Updated:2026-06-04 22:31:15  IST  )

రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం.. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోనూ హాట్‌ టాపిక్‌గా మారింది.

ఆ జిల్లాలో ఫోన్‌ ట్యాపింగ్‌ కలకలం..బీఆర్‌ఎస్‌లో టెన్షన్‌!
X

దిశ, రంగారెడ్డి బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం.. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోనూ హాట్‌ టాపిక్‌గా మారింది. ఫోన్‌ ట్యాపింగ్‌ విచారణ క్లెమాక్స్‌కు చేరిన దశలో ఈ వ్యవహారం ప్రస్తుతం మహేశ్వరం చుట్టూతనే జరుగుతుండడం చర్చనీయాంశమవుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలువురు నేతల ఫోన్లు ట్యాపింగ్‌ జరిగినట్లు ఆరోపణలు ఉండగా.. ట్యాపింగ్‌ కేసులో అరెస్టు అయి పోలీసుల విచారణలో వెలుగుచూస్తున్న ఆధారాల మేరకు సిట్‌ అధికారులు నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా బడంగ్‌‌పేట్‌ మాజీ మేయర్‌ చిగురింత పారిజాత నర్సింహా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సిట్‌ విచారణకు హాజరయ్యారు. ట్యాపింగ్‌‌కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వీరిరువురు నేతలు సిట్‌ అధికారులకు విజ్ఞప్తి చేశారు. రానున్న రోజుల్లో జిల్లాలో ఎవరెవరికి సిట్‌ నుంచి పిలుపు వస్తుందో? ఇది ఎవరి మెడకు చుట్టుకుంటుందో అన్నదానిపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

సిట్‌ నుంచి నెక్ట్స్‌ పిలుపెవరికి!..

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు ప్రత్యేక విచారణ బృందం విచారణను వేగవంతం చేసింది. ఈ నెలలోనే ఛార్జిషీట్‌ దాఖలు చేసేందుకు కసరత్తు చేస్తున్న సిట్‌. ఫోన్‌ ట్యాపింగ్‌ బాధితుల వాంగ్మూలాలను రికార్డు చేస్తోంది. ఫోన్‌ ట్యాపింగ్‌ ఎస్‌‌ఐబీ కార్యాలయం వేదికగా జరగగా.. ఇతర ప్రైవేటు ప్రదేశాల్లోనూ ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారాన్ని నడిపించినట్లు ఆరోపణలు ఉన్నాయి. షాద్‌‌నగర్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన నియోజకవర్గ, మండల స్థాయి నేతలకు సంబంధించిన ఫోన్లు ట్యాపింగ్‌ అయ్యాయంటూ సిట్‌ నుంచి నోటీసులు అందుకున్న పలువురు నేతలు చాలా రోజుల క్రితమే జూబ్లిహిల్స్ పీఎస్‌కు వెళ్లి వాంగ్మూలం ఇచ్చి వచ్చారు. తాజాగా.. మహేశ్వరం నియోజకవర్గంలోని కీలక నేతలను సిట్‌ విచారణకు పిలుస్తుండడం చర్చనీయాంశం అవుతోంది. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన బడంగ్‌‌పేట్‌ కార్పొరేషన్‌ మాజీ మేయర్‌ చిగురింత పారిజాత, నర్సింహా రెడ్డి దంపతుల ఫోన్లు ట్యాపింగ్‌‌కు గురైనట్లు సిట్‌ గుర్తించి మూడు రోజుల క్రితం వారిని విచారణకు పిలిపించింది. 2014-18 మధ్యకాలంలో మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేసిన తీగల కృష్ణారెడ్డి ఫోన్‌ సైతం ట్యాపింగ్‌ జరిగినట్లు గుర్తించి గురువారం సిట్‌ ఆయన స్టేట్‌ మెంట్‌‌ను రికార్డు చేసింది. తమ ఫోన్లను ట్యాపింగ్‌ చేయడమేమిటని.. సదరు నేతలే ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సిట్‌ నుంచి నోటీసులు వచ్చే వరకు కూడా తమ ఫోన్‌‌లు ట్యాపింగ్‌ జరిగిన విషయం తెలియదని వారు వాపోతుండడం గమనార్హం. జిల్లాలో ఇంకా ఎవరెవరికి సిట్‌ నుంచి నోటీసులు వస్తాయో! అన్నదానిపై నేతల్లో ఒకింత ఉత్కంఠత నెలకొంది.

బీఆర్‌ఎస్‌లో టెన్షన్‌!..

అధికార పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని.. వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని చెప్పుకుంటున్న నేతలను ప్రస్తుత పరిస్థితులు షేక్‌ చేస్తున్నాయి. సిట్‌ విచారణకు హాజరైన మాజీ మేయర్‌.. సిట్‌ విచారణ సందర్భంగా గత ప్రభుత్వంలోని మాజీ మంత్రి పేరును ప్రస్తావించినట్లు ప్రచారం జరుగుతోంది. తమ వ్యక్తిగత స్వేచ్చకు భంగం కలిగించిన పెద్దలపై కఠిన చర్యలు తీసుకోవాలని తీగల కృష్ణారెడ్డి సైతం సిట్‌ అధికారులను కోరారు. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో గత ప్రభుత్వంపైనే అనుమానాలు వ్యక్తం అవుతుండడం ఆ పార్టీ క్యాడర్‌‌ను ఒకింత గందరగోళానికి గురి చేస్తోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతల విషయంలో భవిష్యత్తులో ఏం జరుగబోతుందో! అన్నదానిపై కూడా పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొన్నట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలను బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారాన్ని కాంగ్రెస్ నేతల తమ రాజకీయ మనుగడ కోసం వాడుకుంటున్నాయని బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు మండిపడుతున్నారు. బడంగ్‌‌పేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌‌లో జరిగిన రూ.150కోట్ల అవినీతి వ్యవహారం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుందని ఈ సందర్భంగా వారు వ్యాఖ్యానిస్తున్నారు. బడంగ్‌‌పేట్‌ అవినీతిపై కూడా సిట్‌‌తో విచారణ జరిపించాలన్న డిమాండ్‌ బీఆర్‌ఎస్ శ్రేణుల నుంచి వినిపిస్తోంది.

Next Story