మా హక్కులు మాకిచ్చేది ఎప్పుడు?

by Ravi |   (  Updated:2025-03-08 01:00:43  IST  )

అమ్మ కడుపులో పడినప్పుడే ఆడ శిశువునని , అమ్మాయిగా ఉన్నప్పుడు కామపిశాచులతో, అమ్మగా మారినప్పుడు

మా హక్కులు మాకిచ్చేది ఎప్పుడు?
X

"అమ్మ కడుపులో పడినప్పుడే ఆడ శిశువునని , అమ్మాయిగా ఉన్నప్పుడు కామపిశాచులతో, అమ్మగా మారినప్పుడు మగ శిశువును కనలేదని, పుట్టింటికి వెళ్లాలంటే పది ప్రశ్నలు, నచ్చింది కొనాలంటే వంద అనుమతులు.. మహిళల ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలు భర్తల ఆంక్షల మధ్య ఆవిరి అవుతున్నాయి " ఇది నేటి సామాన్య మహిళా ముఖ చిత్రం. అందరి పరిస్థితి ఇలా ఉండకపోవచ్చు. కొందరి విషయంలో మాత్రం ఇది నిజం!

ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. వాస్తవం చెప్పాలంటే సమాజం ఈ ఒక్క రోజు మాత్రమే స్త్రీల గురించి ఆలోచిస్తుంది. తర్వాత షరా మామూలే.. ఈ రోజు మహిళల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రాజకీయ విజయాలను జరుపుకునే ప్రపంచ మహిళా దినోత్సవం. మహిళా సాధికారిత సాధించాలంటే రాజకీయంగా, విద్యాపరంగా, ఆర్థికంగా, సామాజికంగా, భౌతికంగా రాటు తేరాల్సిందే.

ఇది ఇప్పటి సమస్య కాదు!

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ అన్నట్లు "సామాజిక పురోగతికి రాజకీయ అధికారమే కీలకం". సాధికారత అంటే ఒకరి దయా దాక్షిణ్యాల, అనుమతుల మీద ఆధారపడాల్సిన అవసరం లేని స్వాతంత్ర వైఖరితో ఇతరులతో సమాన స్థాయిలో వ్యవహరించగలగడం, నిర్ణయాలు తీసుకోగలగడం. భావజాలపరమైన అడ్డుగోడలు లేకుండా సామాజిక వాతావరణం కలిగి ఉండటం. స్త్రీవాదం కేవలం స్త్రీలకు సంబంధించినదే కాదు. దీనికి అందరి సహాయ సహకారాలు అవసరం. సమానత్వం కోసం మహిళల పోరాటం ఏ ఒక్కరి లేదా ఏ ఒక్క సంస్థకు చెందినది కాదు. మానవ హక్కుల గురించి పట్టించుకునే వారందరి సమిష్టి కృషికి సంబంధించింది. మహిళా సాధికారత అనేది కేవలం సామాజిక న్యాయానికి సంబంధించిన అంశం మాత్రమే కాదు. ఇది ఆర్థిక అనివార్యం కూడా. ప్రతి మహిళ విజయం మరొకరికి స్ఫూర్తిగా ఉండాలి. ఇలా చెప్పుకుంటే చాలా రంగా ల్లో మహిళలు వివక్షతకు గురవుతూనే ఉన్నారు. ఇది ఇక్కడితోనే ఆగడం లేదు. ఆర్థిక స్వాతంత్రం ఉన్నా ఖర్చు చేయడం మాత్రం మగవారి కనుసన్నల్లోనే! మహిళలు రాజకీయ పదవులకు ఎన్నికైనా కొంతమంది విషయంలో అధికారం చలాయించేది మాత్రం వారి ప్రతినిధులే! కొంతమంది పురుషుల పదునైన చూపులకు ఆరేళ్ల నుండి అరవై ఏళ్ల వరకు వయసున్న మహిళలు భయపడుతున్నారు. ప్రతీ రోజు దేశంలో ఎక్కడో ఒక దగ్గర కామాంధులకు ఓ ఆడది బలైపోతూనే ఉంది. ఇది ఇప్పటి సమస్య కాదు. అనాదిగా మహిళలు అనుభవిస్తున్న వ్యధ.

పరిష్కారాలు..

మహిళల హక్కులు, లింగ సమానత్వం సాధించడానికి మహిళల ఆర్థిక సాధికారత అవసరం. ఎక్కువ మంది మహిళలు పని చేస్తే, ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుంది. మహిళల, బాలికల విద్యాసాధనను పెంపొందించడం మహిళల ఆర్థిక సాధికారతకు మరింత సమగ్రమైన, పర్యావరణ పరంగా స్థిరమైన ఆర్థిక వృద్ధికి దోహదపడుతుంది. మహిళల ఆర్థిక సాధికారతను వేగవంతం చేయడానికి దోహదపడే అంశాలను చూస్తే ఆర్థిక వనరులతో మహిళలను అనుసందానించడం వలన వారి ప్రాథమిక అవసరాలను తీర్చడంలో, వ్యాపారాలను ప్రారంభించడంలో, అభివృద్ధి చేయడంలో వారికి సహాయపడుతుంది. మహిళలకు ఆర్థిక వనరులతో పాటు భూమి, సమాచారం, సాంకేతికత, సహజ వనరులు అందుబాటులో ఉండాలి. సైన్స్, టెక్నాలజీ ఇంజినీరింగ్‌తో సహా ప్రస్తుతం వారు తక్కువగా ప్రాతినిధ్యం వహిస్తున్న రంగాలలో మహిళల అర్ధవంతమైన భాగస్వామ్యాన్ని పెంచడం వారి సాధికారతకు కీలకం.

కింజరాపు అమరావతి

82472 86357

Next Story