- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యం..
నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని, చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక విమర్శలు చేస్తున్నాయని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు.

దిశ, చెన్నూర్: నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని, చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక విమర్శలు చేస్తున్నాయని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో సుమారు రూ.1.40 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన బైపాస్ రోడ్డును ఆదివారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పట్టణంలో ఎన్నో ఏళ్లుగా నెలకొన్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారంగా బైపాస్ రోడ్డును నిర్మించామని తెలిపారు. భారీ వాహనాల రాకపోకలు ఇకపై బైపాస్ మీదుగా సాగడంతో పట్టణ ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు, కాలుష్యం తగ్గుతాయని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పనులు చేపట్టామని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమని మంత్రి అన్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా త్వరితగతిన రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేశామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో నిధులు లేకున్నా ఆర్భాటంగా శంకుస్థాపనలు చేసి పనులు పూర్తి చేయకుండా వదిలేశారని విమర్శించారు.
విద్యార్థులతో రాజకీయాలు చేయడం మానుకోవాలి
తమ ప్రభుత్వం మాత్రం హామీలకే పరిమితం కాకుండా అభివృద్ధిని చేసి చూపిస్తోందని స్పష్టం చేశారు. రోడ్డు విస్తరణలో భాగంగా ఇంటి యజమానులు స్వచ్ఛందంగా సహకరించారని వారికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. పెద్ద చెరువులోని అగస్త్య గుండాలు, శివాలయాన్ని అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. విద్యార్థులతో రాజకీయాలు చేయడం మానుకోవాలని ప్రతిపక్ష నాయకులకు మంత్రి సూచించారు. మైనారిటీ హాస్టల్‌లోకి అనుమతులు లేకుండా ప్రవేశించి విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి చర్యలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. చెన్నూరు పట్టణ ప్రజల చిరకాల వాంఛ అయిన గోదావరి తాగునీటిని ఇంటింటికీ అందించేందుకు రూ.40 కోట్లతో ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తున్నామని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.






