వయసుకో రేటు.. వ్యభిచారానికో వాట్సాప్ గ్రూపు..!

by  |
వయసుకో రేటు.. వ్యభిచారానికో వాట్సాప్ గ్రూపు..!
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన కాజల్ (పేరు మార్చాం) ఐదేళ్ల క్రితం కన్నవారిని కాదని.. అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడి (రమేశ్)తో ప్రేమ వివాహం చేసుకుంది. దీంతో కాజల్ తల్లిదండ్రులు ఆమెను ఇంటి నుంచి గెంటేశారు. చేసేదేం లేక ఆ ప్రేమికులిద్దరూ విజయవాడలోని ఓ కాలనీలో రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే వారికి ఓ బాబు పుట్టాడు. ప్రస్తుతం అతడి వయస్సు ఏడాదిన్నర. అయితే సరిగ్గా ఏడాది క్రితం కాజల్ భర్త రమేశ్ ఏదో పని నిమిత్తం ద్విచక్ర వాహనంపై బజారుకెళ్లి వస్తుండగా గుర్తు తెలియని వాహనం అతడిని బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడి వెన్నుపూసకు తీవ్ర గాయమై మంచం నుంచి లేవలేని స్థితికి చేరాడు. దీంతో కాజల్‌పైనే కుటుంబ భారమంతా పడింది. ఒంటరిగానే టిఫిన్ సెంటర్ బండి నడుపుతూ కుటుంబాన్ని సాకుతూ వస్తోంది.

ఈ నేపథ్యంలో ఆరు నెలల క్రితం కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్ విధించడంతో వారి జీవనోపాధి కోల్పోయింది. అప్పటివరకు కాస్తో కూస్తో దాచుకున్న కొద్దిపాటి డబ్బు.. భర్త వైద్యానికి ఇంటి ఖర్చులకు రెండు నెలలు సరిపోయింది. పని లేకపోవడం.. టిఫిన్ సెంటర్ తెరిచే పరిస్థితి లేకపోవడంతో అందినకాడికి అప్పులు చేసింది. అయినా చేసేందుకు పని దొరకలేదు. ఆ పరిస్థితుల్లో విజయవాడకు చెందిన శాంతమ్మ(పేరు మార్చాం) పరిచయమయ్యింది. వ్యభిచారం చేస్తే.. చాలా ఎక్కువ సంపాదించుకోవచ్చని.. ఎలాంటి ఇబ్బంది ఉండదని.. మన ప్రాంతం కూడా కాదని చెప్పింది. వేరే దారి లేక కాజల్ అందుకు అంగీకరించింది. తన కొడుకును మంచానికి పరిమితమైన భర్తకు అప్పజెప్పి.. నందిగామ ప్రాంతంలోని ఓ మిల్లులో పని దొరికింది అంటూ రోజు వెళ్లి వస్తోంది. తన భర్త రమేశ్‌కు ఒక్కోసారి రాత్రిళ్లు సైతం డ్యూటీ ఉంటుందని చెప్పి.. గత్యంతరం లేని పరిస్థితుల్లో వ్యభిచారం చేయాల్సి వస్తుందంటూ కాజల్ ‘దిశ’తో తన గోడును వెళ్లబోసుకుంది. కాజల్ లాంటి వారు మరికొంతమంది విధిలేని పరిస్థితుల్లో వ్యభిచార రోంపిలోకి దిగినవారు లేకపోలేదు.

అది కోదాడ పట్టణ ప్రాంతం. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతం. కోదాడ నియోజకవర్గం తెలంగాణ ప్రాంతంలోనిది అయినప్పటికీ.. అక్కడ ఏపీ కల్చర్ ఎక్కువగా కన్పిస్తుంది. ఇదిలావుంటే.. ప్రస్తుతం కోదాడ ప్రాంతంలో హైటెక్ వ్యభిచారం మూడు పువ్వులు.. ఆరు కాయలు అన్న చందంగా సాగుతోంది. కొంతమంది మహిళలు, యువతుల బలహీనతలను ఆసరాగా చేసుకుని స్థానిక నేతలు, అధికారుల అండదండలతో అక్రమార్కులు విచ్చలవిడిగా వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నారు. తమ వ్యభిచార దందా కోసం నిర్వాహకులు.. సోషల్ మీడియాను సైతం దర్జాగా వాడుకుంటుండడం గమనార్హం.

అందమైన యువతులు, మహిళలతో వ్యభిచారం నిర్వహించే క్రమంలో ఎవ్వరికీ అనుమానం రాకుండా ఉండేందుకు అపార్ట్‌మెంట్లను అడ్డాలుగా చేసుకుంటున్నారు. కోదాడ పట్టణం అశోక్‌ నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకుని అడ్డాగా చేసుకున్నారు. అందులో వ్యభిచారం నిర్వహిస్తూ విటుల నుంచి పెద్దఎత్తున డబ్బు గుంజుతున్నారు. అయితే ఈ దందాకు స్థానిక నేతలతో పాటు అధికారుల అండదండలు దండిగా ఉన్నాయి. ఏపీలోని కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల నుంచి మహిళలు, యువతులను రప్పించి యథేచ్చగా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఒక్కోక్కరికి ఒక్కో రేటును నిర్వహించారు. 30 నుంచి 40 ఏళ్ల వయస్సు ఉన్న వారికి రూ.వెయ్యి, 23 ఏళ్ల నుంచి 29 ఏళ్ల వయస్సు వారికి రూ.2వేలు, 15 సంవత్సరాల నుంచి 22 ఏళ్ల పెళ్లి కాని అమ్మాయిలకు రూ.3వేల చొప్పున ధరలను నిర్వాహకులు ఫిక్స్ చేశారు.

ఈ వ్యభిచార దందాను పేరుకు కోదాడ పట్టణంలో నిర్వహిస్తున్నప్పటికీ విటులు మాత్రం కోదాడ నియోజకవర్గంతో పాటు హుజూర్‌నగర్ నియోజకవర్గం నుంచి వస్తుంటారు. అయితే నిర్వహకులు తమ ప్రచారాన్ని సులువుగా చేసుకునేందుకు సోషల్ మీడియాను సైతం వదలడం లేదు. ప్రత్యేకంగా ‘రెగ్యులర్ కస్టమర్స్’ పేరుతో వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేశారు. ఆ గ్రూపులో అందమైన యువతులు, మహిళల ఫొటోలను పోస్టు చేస్తారు. నచ్చినవారు సంప్రదించాలంటూ కాంటాక్ట్ నంబరును సైతం పెడుతుంటారు. గతంలోనూ ఇలాంటి గ్రూపును ఏర్పాటు చేశారు. కానీ అది కొద్దిరోజుల పాటు నిలిచిపోయింది. తాజాగా తిరిగి ఆ వాట్సాప్ గ్రూపు యాక్టివ్‌గా మారింది.

ఈ హైటెక్ వ్యభిచార గుట్టును కోదాడ పట్టణానికి చెందిన ఓ అధికారి అపార్ట్‌మెంట్ అడ్రస్‌ సహా సంపాదించాడు. ఆ అడ్రస్ ప్రకారం.. అతడు ఉన్నతాధికారులకు ఎవరికీ సమాచారం ఇవ్వకుండా ఓ విటుడిలా వెళ్లాడు. అపార్ట్‌మెంట్ వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహకుల తీరు, అక్కడి యువతులను చూసి ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు. అనంతరం తాను ఓ అధికారినంటూ ఐడీ కార్డు చూపడంతో నిర్వాహకులు కాళ్ల బేరానికి వచ్చారు. సదరు అధికారితో మాటామంతీ పూర్తి చేసుకుని నిర్వాహకులతో రూ.5 లక్షలు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఒప్పందం చేసుకున్న పావుగంటకే నిర్వాహకులు అనుకున్న మాట ప్రకారం.. రూ.5 లక్షలు ఇచ్చేశారు. దీంతో ఆ అధికారి అప్పటికి వెనక్కి వెళ్లిపోయాడు. కానీ తర్వాత అసలు దీని వెనుక ఎవరున్నారే విషయం ఆరా తీస్తే.. స్థానిక నేతల దగ్గరి నుంచి ఒకరిద్దరూ మీడియా ప్రతినిధుల దాకా ఉండడం సదరు అధికారిని విస్మయానికి గురిచేసింది. కానీ అప్పటికే అతడు డబ్బు తీసుకోవడం.. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పే పరిస్థితుల్లో లేకపోవడం వల్ల మిన్నకుండిపోయారు. గతంలోనూ కోదాడ పట్టణ పరిధిలోని కట్టకొమ్ముగూడం రోడ్డులోని పెరకాస్థుల బజారులో ఇదే తరహాలో ఓ ఇంటి భారీ వ్యభిచార ముఠా గుట్టురట్టయ్యింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వ్యభిచార ముఠా, అందుకు సహకరిస్తున్న నేతలపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.



Next Story