సహజీవనానికి అడ్డుగా ఉన్నాడని 6 ఏళ్ల బాలుడి హత్య.. నిందితురాలికి జీవిత ఖైదు

by Jakkula.Mamatha |

సహజీవనానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో ఆరేళ్ల బాలుడిని గొంతు నులిమి హత్య చేసిన మహిళకు గురువారం సూర్యాపేట జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది.

సహజీవనానికి అడ్డుగా ఉన్నాడని 6 ఏళ్ల బాలుడి హత్య.. నిందితురాలికి జీవిత ఖైదు
X

దిశ,సూర్యాపేట: సహజీవనానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో ఆరేళ్ల బాలుడిని గొంతు నులిమి హత్య చేసిన మహిళకు గురువారం సూర్యాపేట జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ కేసుకు సంబంధించిన విచారణ, శిక్ష వివరాలను జిల్లా ఎస్పీ నరసింహ వెల్లడించారు. 2023 ఆగస్టు నెలలో సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మూడో విడత ఇందిరమ్మ కాలనీలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. గరిడేపల్లి మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన మచ్చ మధు కుమారుడు, ఆరేళ్ల బాలుడు టైసన్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. బాలుడి మరణం పై అనుమానం వ్యక్తం చేసిన అతని నాయనమ్మ మచ్చ కమలమ్మ సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

దీంతో పోలీసులు తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం పోస్టుమార్టం నివేదికలో బాలుడిని గొంతు నులిమి హత్య చేసినట్లు తేలడంతో కేసును హత్య కేసుగా మార్చి విచారణ కొనసాగించారు. సాంకేతిక ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలు సేకరించిన పోలీసులు బాలుడి తండ్రితో సహజీవనం చేస్తున్న మోతే మండలం సర్వారం గ్రామానికి చెందిన నల్లాల వాణి అలియాస్ రాణి ఈ హత్యకు పాల్పడినట్లు గుర్తించారు. దర్యాప్తులో భాగంగా నిందితురాలిపై బలమైన ఆధారాలు సేకరించి, సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసి అభియోగ పత్రాలను కోర్టులో దాఖలు చేశారు.

కేసును విచారించిన సూర్యాపేట జిల్లా కోర్టు న్యాయమూర్తి లక్ష్మీ ప్రసన్న నిందితురాలు నేరానికి పాల్పడినట్లు నిర్ధారించి ఆమెకు జీవిత ఖైదుతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. ఈ కేసులో బాధితుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మణ్ రాథోడ్ వాదనలు వినిపించారు. కోర్టు డ్యూటీ కానిస్టేబుల్ శోభన్‌బాబు, కోర్టు లైజన్ అధికారి హెడ్ కానిస్టేబుల్ శ్రీకాంత్ కోర్టు అధికారులతో సమన్వయం చేశారు. కేసు దర్యాప్తును అప్పటి ఇన్‌స్పెక్టర్, స్థానిక డీఎస్పీ, సీఐలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించినట్లు ఎస్పీ తెలిపారు.

దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం, మచ్చ మధు ఇంటర్ చదువుతున్న సమయంలో కోడి స్వప్నను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరికి టైసన్ జన్మించిన కొంతకాలానికే స్వప్న భర్తను, కుమారుడిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అనంతరం మధు, నల్లాల వాణి అలియాస్ రాణితో కలిసి సూర్యాపేటలోని ఇందిరమ్మ కాలనీలో సహజీవనం చేస్తున్నాడు. అయితే మధు-వాణి సహజీవనానికి బాలుడు టైసన్ అడ్డుగా ఉన్నాడని భావించిన వాణి అతడిని గొంతు నులిమి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో నిందితురాలికి జీవిత ఖైదు విధించడంతో బాధిత కుటుంబానికి న్యాయం జరిగినట్లు ఎస్పీ నరసింహ పేర్కొన్నారు.

Next Story