అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్.. రూ.38 లక్షల నగలు స్వాధీనం

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-06-04 15:31:01  IST  )

చిత్తూరు మిట్టూరులో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారని డీఎస్పీ జె. వెంకటనారాయణ వెల్లడించారు. ఈ కేసులో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసి, వారి వద్ద నుండి రూ.38 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు...

అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్.. రూ.38 లక్షల నగలు స్వాధీనం
X

దిశ, చిత్తూరు ప్రతినిధి: చిత్తూరు మిట్టూరులో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారని డీఎస్పీ జె. వెంకటనారాయణ వెల్లడించారు. ఈ కేసులో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసి, వారి వద్ద నుండి రూ.38 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఈ వివరాలను విలేకరులకు తెలిపారు. డీఎస్పీ కథనం మేరకు... మిట్టూరుకు చెందిన ఎన్.పి. గౌతమ్ కిరణ్ కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు తాళాలు పగులగొట్టి దోపిడీకి పాల్పడ్డారు.

జిల్లా ఎస్పీ తుషార్ డూడి పర్యవేక్షణలో, రెండవ పట్టణ సీఐ డి. నెట్టికంటయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు సాంకేతిక ఆధారాల సాయంతో దర్యాప్తు చేపట్టాయి. గురువారం చిత్తూరు కట్టమంచి వివేకానంద విగ్రహం సమీపంలో తమిళనాడు వేలూరు జిల్లా కాట్పాడికి చెందిన తండ్రీకొడుకులు పెరుమాళ్లు కృష్ణ (54), కృష్ణ సంతోష్ కుమార్ (26)లను అదుపులోకి తీసుకున్నారు.

ప్రస్తుతం వీరు తిరుపతి కొర్లగుంటలో నివసిస్తున్నారు. నిందితుల నుంచి రూ.28 లక్షల విలువైన 186 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.10 లక్షల విలువైన 3.75 కిలోల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కర్ణాటకలో 17, తిరుపతిలో 3 చొప్పున మొత్తం 20 పాత కేసులు ఉన్నాయని డీఎస్పీ పేర్కొన్నారు. ఈ కేసును ఛేదించిన ఒకటవ పట్టణ ఎస్‌ఐ కె. శివశంకర్, సిబ్బందిని ఎస్పీ తుషార్ డూడి అభినందించి రివార్డులు ప్రకటించారు. ఇళ్లకు తాళాలు వేసి ఊళ్లకు వెళ్లేవారు స్థానిక పోలీస్ స్టేషన్‌లో సమాచారం అందించి ఎల్హెచ్ఎంఎస్ యాప్ సేవలను వినియోగించుకోవాలని, ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని డీఎస్పీ వెంకటనారాయణ ఈ సందర్బంగా సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 112 లేదా పోలీసు వాట్సాప్ నంబర్ 9440900005ను సంప్రదించాలన్నారు.

Next Story