తెలంగాణ సాధనలో బీజేపీ పాత్రను విస్మరించొద్దు

by Taduka Kalyani |

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమకే పూర్తి క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు అన్నారు.

తెలంగాణ సాధనలో బీజేపీ పాత్రను విస్మరించొద్దు
X

దిశ ఖైరతాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమకే పూర్తి క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాయని, అయితే పార్లమెంట్‌లో బీజేపీ బేషరతుగా మద్దతు ఇవ్వడం వల్లే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందనే చారిత్రక వాస్తవాన్ని విస్మరించరాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామ్చందర్ రావు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన “మీట్ ది ప్రెస్” కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర అభివృద్ధి, ఉద్యోగాలు, నీటి పంపిణీ తదితర అంశాలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాల పనితీరును తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు అప్పట్లో పార్లమెంట్‌లో తీవ్ర స్థాయిలో కుట్రలు జరిగాయని రాంచందర్ రావు గుర్తు చేశారు. తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో కొందరు ప్రజాప్రతినిధులు పెప్పర్ స్ప్రే ఘటనలకు పాల్పడి సభను అస్తవ్యస్తం చేశారని అన్నారు. అలాంటి పరిస్థితుల్లోనూ దేశ ప్రయోజనాలు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ బిల్లుకు బేషరతుగా మద్దతు ఇచ్చిందని తెలిపారు.పార్లమెంట్‌లో బిల్లు చర్చకు వచ్చిన సమయంలో తెలంగాణ ఉద్యమాన్ని నడిపినట్లు చెప్పుకునే నాయకులు సభలో లేకపోయినా, బీజేపీ మాత్రం రాష్ట్ర సాధనకు అండగా నిలిచిందని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో 1,200 మందికి పైగా యువకులు, విద్యార్థులు చేసిన త్యాగాలు రాష్ట్ర సాధనకు పునాది అయ్యాయని ఆయన అన్నారు..తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు గడిచినా ఉద్యమకారులకు సరైన గుర్తింపు లభించలేదని రాంచందర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం పోరాడిన విద్యార్థులపై కేసులు నమోదు చేయడం, వారికి తగిన గౌరవం ఇవ్వకపోవడం బాధాకరమని అన్నారు.కొన్ని కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చి తెలంగాణ యువత ఆకాంక్షలు నెరవేర్చినట్లు చెప్పుకోవడం సరైంది కాదన్నారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో రెగ్యులర్ ప్రొఫెసర్ల కొరత తీవ్రంగా ఉందని, పార్ట్‌టైమ్ సిబ్బందితోనే విద్యా వ్యవస్థ నడుస్తోందని విమర్శించారు.నియామకాల విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు రెండూ విఫలమయ్యాయని రాంచందర్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్ అమలుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోవడంలో విఫలమైందన్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు సకాలంలో అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. పెండింగ్ బకాయిల కారణంగా దాదాపు 60 మందికి పైగా రిటైర్డ్ ఉద్యోగులు మరణించారని పేర్కొంటూ ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా నీటి వనరులపై స్పష్టమైన విధానాన్ని రూపొందించడంలో పాలకులు విఫలమయ్యారని రాంచందర్ రావు ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకు రావాల్సిన నీటి వాటా విషయంలో రాజీ పడిందని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రాష్ట్ర హక్కులను సమర్థంగా కాపాడలేకపోతోందని విమర్శించారు. కృష్ణా జలాల అంశంలో తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.తెలంగాణ ఉద్యమానికి ప్రధాన నినాదమైన “నీళ్లు, నిధులు, నియామకాలు” అనే మూడు అంశాల్లోనూ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రజలను నిరాశపరిచాయని రాంచందర్ రావు అన్నారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో రెండు పార్టీలూ విఫలమయ్యాయని విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి కోసం గత 12 ఏళ్లలో సుమారు రూ.13 లక్షల కోట్ల నిధులు మంజూరు చేసిందని రాంచందర్ రావు తెలిపారు. కేంద్ర సహకారం లేకపోతే రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు తీవ్రంగా ప్రభావితమయ్యేవని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా బీజేపీ కట్టుబడి పనిచేస్తోందని, రాష్ట్ర అభివృద్ధి మరియు యువత భవిష్యత్తు కోసం పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.

Next Story