- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాలమూరు ప్రాజెక్టుల పూర్తి కోసం వేగం పెంచాలి.. కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
పాలమూరు ప్రాంత సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు.

దిశ, వెబ్‌డెస్క్: పాలమూరు ప్రాంతంలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇవాళ రాత్రి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రాజెక్టుల నిర్మాణంలో భూసేకరణ (Land Acquisition) అత్యంత కీలకమని పేర్కొన్న సీఎం, అది పూర్తి కాకుండా పనులు ముందుకు సాగడం సాధ్యం కాదని అన్నారు. అందుకే భూసేకరణ ప్రక్రియను తొలి ప్రాధాన్యంగా తీసుకుని ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమన్వయం చేసుకుంటూ భూసేకరణ పనులను ముందుకు తీసుకెళ్లాలని, ఈ బాధ్యతను జిల్లా కలెక్టర్లు సమర్థవంతంగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి భూసేకరణకు సంబంధించిన సమస్యలను పరిష్కరించి ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. భూసేకరణ కోసం అవసరమైన నిధులను ప్రభుత్వం ఎప్పటికప్పుడు విడుదల చేస్తుందని హామీ ఇచ్చారు. పాలమూరు ప్రాజెక్టుల పూర్తి ద్వారా సాగునీటి సౌకర్యాలు మెరుగుపడి రైతులకు గణనీయమైన ప్రయోజనం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సమీక్షలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ప్రణాళికా బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, ఉమ్మడి జిల్లా ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.






