మరోసారి కర్ణాటక నుంచి రాజ్యసభ ఖర్గే

by Muthe.Rajitha |

కర్ణాటకలో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులు ఖరారైనట్టు కనిపిస్తోంది.

మరోసారి కర్ణాటక నుంచి రాజ్యసభ ఖర్గే
X

దిశ, వెబ్ డెస్క్ : కర్ణాటకలో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులు ఖరారైనట్టు కనిపిస్తోంది. కర్ణాటక అసెంబ్లీలో ఉన్న తాజా బలాబలాల సమీకరణాల ప్రకారం.. ఈ నాలుగు స్థానాలలో మూడు స్థానాలను అధికార కాంగ్రెస్ పార్టీ, మిగిలిన ఒక స్థానాన్ని ప్రధాన ప్రతిపక్షమైన(BJP) కి దక్కనున్నాయి. జూన్ 8వ తేదీతో నామినేషన్ల దాఖలు గడువు ముగియనుండటంతో, ఇరు పార్టీల అధిష్ఠానాలు తమ అభ్యర్థుల ఎంపికను దాదాపు ఖరారు చేసి, అధికారిక ప్రకటనలకు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నట్లు రాజకీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత అయిన మల్లికార్జున్ ఖర్గేకే కేటాయించడం దాదాపు ఖాయమైంది. ఆయనను మరోసారి కర్ణాటక నుండే ఎగువ సభకు పంపడం ద్వారా ఢిల్లీలో ప్రతిపక్షాల పోరాటాన్ని మరింత బలోపేతం చేయవచ్చని హైకమాండ్ భావిస్తోంది. ఖర్గేతో పాటు కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లే మిగిలిన రెండు స్థానాల కోసం పార్టీ జాతీయ మీడియా విభాగం కన్వీనర్ పవన్ ఖేరా, అలాగే కర్ణాటకకు చెందిన సీనియర్ నేత మన్సూర్ అలీ ఖాన్ పేర్లను అధిష్ఠానం పరిశీలిస్తోందని సమాచారం. ముఖ్యంగా పవన్ ఖేరాను ఎగువ సభకు పంపడం ద్వారా పార్లమెంట్‌లో పార్టీ వాణిని గట్టిగా వినిపించాలని కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

మరోవైపు, తమకు దక్కే ఏకైక రాజ్యసభ స్థానం కోసం బీజేపీ కూడా గట్టి కసరత్తే చేస్తోంది. ఈ రేసులో మండ్య మాజీ ఎంపీ, సినీ నటి సుమలత అంబరీష్, ఉడుపికి చెందిన మాజీ మంత్రి ప్రమోద్ మధ్వరాజ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. గత లోక్‌సభ ఎన్నికల సమయంలో మండ్య సీటును కూటమిలో భాగంగా జేడీఎస్‌కు కేటాయించినప్పుడు, సుమలత బీజేపీ నిర్ణయానికి కట్టుబడి నిలిచారు. ఆ సమయంలో ఆమెకు తగిన ప్రాధాన్యత ఇస్తామని కేంద్ర పెద్దలు హామీ ఇచ్చిన నేపథ్యంలో, ఇప్పుడు ఆమెను రాజ్యసభకు పంపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టాక్ నడుస్తోంది. అయితే, తీరప్రాంత కర్ణాటకలో పార్టీ పట్టును మరింత బలోపేతం చేసుకునేందుకు ప్రమోద్ మధ్వరాజ్ వైపు అధిష్ఠానం మొగ్గు చూపినా ఆశ్చర్యపోనక్కర్లేదని, జూన్ 8 లోపు దీనిపై పూర్తి స్పష్టత రానుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Next Story