పవన్ ఏం ఆన్సర్ చెబుతారు?

by  |

మూడు రాజధానులను తీవ్రంగా వ్యతిరేకిస్తూ అమరావతే రాజధానిగా ఉండాలని ఒంటికాలిపై లేస్తూ వైసీపీపై విరుచుకు పడుతున్న పవన్ కల్యాణ్‌ త్వరలో ఏం చేయబోతున్నారన్న దానిపై రాష్ట్రంలో తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే జనసేన ఫ్రెండ్ బీజేపీ ఢిల్లీ నుంచి జగన్‌కు లైన్‌క్లియర్ చేయడంతో ఈ నెల 10 నుంచి అమరావతి ప్రాంతంలో పర్యటించబోతున్నానని ప్రకటించిన పవన్‌ 29 గ్రామాల రైతులకు, నేతలకు ఏవిధమైన సమాధానం చెబుతారన్నది ఆసక్తికరంగా మారింది. అమరావతే రాజధానిగా ఉంటుందని తనకు తాను కుండబద్దలు కొట్టుకుంటూ రెండు మూడు సార్లు ఢిల్లీ వెళ్లి హడావుడి చేసిన పవర్ స్టార్ ఏవిధమైన వ్యూహంతో జనాల్లోకి వెళ్తారన్నది క్వశ్చన్ మార్క్‌గా మారింది.

మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ వచ్చిన ఏపీ బీజేపీ నేతలంతా మొన్న లోక్‌సభలో కేంద్రం క్లారిటీ ఇవ్వడంతో అంతా మిన్నకుండిపోయారు. అంతేకాదు లోకల్ బీజేపీ నేతలు సైతం రాజధానుల అంశంపై ఏం మాట్లాడే పరిస్థితే ఉండదు. అస్సలు ఎవ్వరూ హైకమాండ్‌ను ధిక్కరించి నోటివెంట ఒక్కమాట మాట్లాడే నాథుడే ఉండరు. ఈ నేపథ్యంలో బీజేపీతో పొత్తు పెట్టుకొన్న పవర్‌స్టార్ ప్రస్తుత పరిస్థితుల్లో అమరావతి ప్రాంతంలో పర్యటించే సమయంలో బీజేపీ నేతలను తీసుకెళ్తాడా లేకుంటే ఒక్కడే వెళ్తాడా అన్నది కీలకంగా మారింది. ఒకవేళ బీజేపీ నేతలు వెళ్తే అమరావతి రాజధానికే మద్దతిచ్చినట్లు అవుతుంది. ఈ క్రమంలో పవన్ వెళ్లి మరి పొత్తు పెట్టుకున్న బీజేపీ నిర్ణయాన్ని కాదని అమరావతికే జై అంటూ రైతులతో మమేకం అవుతాడా.. లేకుంటే మూడు రాజధానుల అంశాన్ని మెల్లగా ప్రజల్లోకి తీసుకెళ్లి ఒప్పించే ప్రయత్నం చేస్తాడా అనే ప్రశ్న కూడా రాజకీయ వర్గాల్లో వినపడుతోంది.

ఇప్పటికే కలిసి పనిచేసిన టీడీపీ, వామపక్షాలను వదులుకొని వచ్చి మళ్లీ బీజేపీతో చేతులు కలిపిన పవన్ మూడు రాజధానుల విషయంలో బీజేపీ నిర్ణయాన్ని స్వాగతిస్తాడా లేకుంటే, మూడు రాజధానులు ఎందుకంటూ వైసీపీని టార్గెట్ చేస్తాడా అన్నది తెలియాల్సిన అంశం. కేంద్రం స్పష్టం చేసినా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు మళ్లీ భ్రమలు కల్పించేలా వ్యాఖ్యలు చేస్తుండటంతో ప్రజలు అన్నీ అర్థం చేసుకొని ఓ స్టాండ్‌కు వచ్చేశారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఏం సమాధానం చెబుతూ పవన్ రాజధాన్ని ప్రాంతంలో పర్యటిస్తారన్నది కీలకంగా మారింది.


Next Story

Most Viewed