హుజురాబాద్‌లో TRS పెద్దల ఓవరాక్షన్.. ఓటమికి సంకేతమా.?

by  |
హుజురాబాద్‌లో TRS పెద్దల ఓవరాక్షన్.. ఓటమికి సంకేతమా.?
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : హుజురాబాద్ అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఉత్సవ విగ్రహంలా మారారా..? హాట్ హాట్ కామెంట్స్‌కు దూరంగా ఉంటున్నారా..? నామమాత్రపు పాత్రతోనే సరిపెట్టుకుంటున్నారా..? అంటే అవుననే అనుకుంటున్నారు అక్కడి ప్రజలు.

‘కీ’ రోల్‌కు దూరం..

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో అన్ని తానై వ్యవహరిస్తున్న టీఆర్ఎస్ అధిష్టానం గెల్లుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో ముగ్గురు మంత్రులు, ఇతర ప్రముఖులు టీఆర్ఎస్ గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. కుల సంఘాల సమావేశాలు, గ్రామ స్థాయిలో సమీకరణాలు చేస్తున్నారు. అయితే, చాలా బహిరంగ సమావేశాల్లో క్యాండెట్ నామినల్ రోల్‌కే పరిమితం అవుతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఉద్యమ బిడ్డనంటూ..

అడపాదడపా ఉపన్యాసాలిచ్చేందుకు అవకాశం వస్తున్నప్పుడు తాను ఉద్యమంలో కీలక పాత్ర పోషించానని, తనపై వందకు పైగా కేసులు ఉన్నాయని చెప్పుకుంటున్నారు. కానీ, ఎమ్మెల్యేగా గెలిపిస్తే హుజురాబాద్ డెవలప్‌పై తన విజన్ ఏంటీ.? ప్రత్యర్థి వైఫల్యాలు ఏంటీ అన్న విషయంపై క్లారిటీగా చెప్పలేకపోతున్నారు. దీంతో గెల్లు శ్రీనివాస్ ప్రభావం ప్రజల్లో అంతగా లేకుండా పోతోంది. స్థానికత, బీసీకి బీసీ, ఉద్యమ కారునికి ఉద్యమకారుడితో చెక్ పెట్టే ప్రయత్నం చేసిన అధిష్టానం అభ్యర్థిని ప్రచారంలో దూసుకపోయే విధంగా తర్ఫీదు ఇవ్వలేకపోయిందా లేక ఆయన దూకుడుకు బ్రేకులు వేస్తోందా.? అన్న చర్చ హుజురాబాద్‌లో సాగుతోంది.

బైపోల్స్‌లో వైవిధ్యం..

రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన ఉప ఎన్నికలకు హుజురాబాద్ బై పోల్స్‌కు వైవిధ్యం స్పష్టంగా కనిపిస్తోంది. దుబ్బాక, హుజూర్ నగర్, నాగార్జున సాగర్ బై పోల్స్‌లో అభ్యర్థులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు.. వారు తమ గళాన్ని వినిపించారు. కానీ హుజురాబాద్ విషయంలో మాత్రం ఆ మూడు ఎన్నికలతో పోలిస్తే చాలా తేడా కనిపిస్తోంది. ఇక్కడ ముఖ్య నాయకులే ముందుండి నడిపిస్తున్నారు. అభ్యర్థికి అంతగా ప్రాధాన్యత కల్పించకపోవడంతో ప్రజల్లోకి సంకేతాలు వేరే విధంగా వెళ్తున్నాయి.

అంతర్మథనంలో..

యాదవ సామాజిక వర్గానికి చెందిన గెల్లు శ్రీనివాస్.. అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో ఎన్నో కసరత్తులు చేసిన అధిష్టానం కార్యరంగంలోకి దిగిన తరువాత ఆయనకు ఇచ్చే ప్రయారిటీ విషయంలో ఫెయిల్ అవుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నియోజకవర్గం అంతా తిరుగుతూ ప్రజలతో మమేకం కావల్సిన గెల్లు శ్రీనివాస్ తన ప్రభావాన్ని చాటుకునే ప్రయత్నం చేయలేకపోతున్నారు. ఇందుకు ప్రధాన కారణాలు కూడా లేకపోలేదన్న చర్చలు కూడా సాగుతున్నాయి.

ఇక్కడ పర్యటిస్తున్న మంత్రులు పాడి కౌశిక్ రెడ్డిని వెంటేసుకుని తిరుగుతున్నారని, ఆయనకు ఇచ్చే ప్రాధాన్యతలో గెల్లుకు ఇస్తున్న ప్రయారిటీ నామమాత్రమే కావడంతో ఆయన అంతర్మథనానికి గురవుతున్నారన్న వాదనలూ వినిపిస్తున్నాయి. క్యాండెట్ స్వేచ్చగా ప్రచారం చేసుకోలేకపోతున్నారన్న విషయాన్ని హుజురాబాద్ ప్రజలు గుర్తించారు. ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత కూడా గెల్లు ఇదే పద్దతిలో ముందుకు సాగితే హుజురాబాద్‌కు నష్టమే కదా అన్న అభిప్రాయాలూ వ్యక్తం చేస్తున్న వారూ లేకపోలేదు.

gellu-srinivas



Next Story