బడ్జెట్ పెంచడం వెనక ఆంతర్యమేంటి?

by  |
బడ్జెట్ పెంచడం వెనక ఆంతర్యమేంటి?
X

దిశ, న్యూస్‌బ్యూరో: అసెంబ్లీ సమావేశాల్లో బుధవారం అధికార, విపక్ష సభ్యుల మధ్య వాడీవేడి చర్చ జరిగింది. ఒకవైపు ఆర్థిక మాంద్యం అంటూనే బడ్జెట్ సైజును ప్రభుత్వం ఎందుకు పెంచిందని కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల సభ్యులు ప్రశ్నించారు. బడ్జెట్ అంచనాలకు, ఆదాయ వనరుల సమీకరణకు పొంతనలేకుండా పోయిందని ఫైర్ అయ్యారు. ప్రజల కొనుగోలు శక్తి పడిపోయిందని, ఆర్థిక మందగమనం కొనసాగుతూ ఉందని ప్రభుత్వం ఒకవైపు చెప్తూనే ఆర్థిక వనరులను ఎలా సమీకరించుకోగలుగుతుందని ప్రశ్నించారు. రాష్ట్ర బడ్జెట్‌పై అధికార పార్టీ సభ్యుడు గండ్ర వెంకటరమణారెడ్డి చర్చను ప్రారంభించారు. ఆ తర్వాత మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఒకవైపు ప్రభుత్వాన్ని పొగుడుతూనే చురకలు కూడా అంటించారు. ఆ తర్వాత కాంగ్రెస్ సభ్యుడు మల్లు భట్టి విక్రమార్క సైతం ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు. మిషన్ భగీరథ ఓ బోగస్ పథకమని, అద్భుత పథకంగా ప్రభుత్వం చెప్పుకుంటున్నా అది కాగితాలకే పరిమితమైందని, క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయన్నారు. మరోవైపు ఆదాయం కోసం మద్యాన్ని ఏరులై పారిస్తూ, యువతను మత్తులోకి దించుతున్నారని ధ్వజమెత్తారు.

అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ, గతేడాదికంటే ఈసారి బడ్జెట్ సైజు దాదాపు రూ.40 వేల కోట్లు పెరిగిందని, కేంద్రం నుంచి సహకారం లేదంటూనే ఇంత పెద్ద బడ్జెట్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో అర్థం కావడంలేదన్నారు. ఈ స్థాయిలో ఆర్థిక వనరులను ప్రభుత్వం ఎలా సమకూర్చుకుంటుందన్నది ఒక సవాలు వంటిదేనన్నారు. ప్రస్తుతానికి ప్రజలపై పన్నులు విధించకపోయినప్పటికీ బడ్జెట్‌లో పేర్కొన్నట్లు ఖర్చు పెట్టాలంటే పన్ను భారం తప్పదని అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అప్పు మొత్తం కలిపి దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయలకు చేరుకుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు చేసిన అప్పులపై వడ్డీలు కట్టడానికే ప్రభుత్వం ఏటా రూ. 14 వేల కోట్లను ఖర్చు చేయాల్సి వస్తోందని, ఇప్పుడు పెద్ద బడ్జెట్ పెట్టుకుని ఆదాయ మార్గాలను ఎలా అన్వేషిస్తుందని ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితుల్లో బడ్జెట్‌లో చెప్పినట్లుగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రభుత్వం కొనసాగించడం సాధ్యమేనా అని అనుమానం వ్యక్తం చేశారు. ఇఫ్తార్ విందుకోసం ప్రతీ ఏటా ప్రభుత్వం భారీ స్థాయిలో ఖర్చు చేస్తోందని, ఈ నిధుల్ని మైనారిటీ పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం ఖర్చు చేయడం ఉత్తమంగా ఉంటుందని సూచించారు. తన ఎమ్మెల్యే నిధుల నుంచి ఫలక్‌నుమా కళాశాల సిబ్బందికి జీతాలు చెల్లిస్తున్నానని, మలక్‌పేట్ ఎమ్మెల్యే చంచల్‌గూడ స్కూలు సిబ్బందికి వేతనాలు చెల్లిస్తున్నారని గుర్తుచేశారు. వీరికి జీతాలు ఇవ్వాలన్న బాధ్యతను ప్రభుత్వం విస్మరించిందన్నారు. విద్యారంగంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు.

మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ, గత బడ్జెట్‌లో ప్రభుత్వం వివిధ పథకాలకు సుమారు 25శాతం కోత విధించిందని, వాస్తవాలకు భిన్నంగా తాజా బడ్జెట్‌ను రూపొందించిందన్నారు. విద్య, వైద్యం, సంక్షేమ రంగాలు ఆర్థికలేమితో కొట్టుమిట్టాడుతున్నాయన్నారు. ప్రముఖ ఉస్మానియా విశ్వవిద్యాలయంతో సహా చాలా వర్శిటీల్లో బోధన, బోధనేతర సిబ్బంది లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారని గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చాలా గొప్పగా చెప్పుకునే ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల రంగానికి కేటాయించిన నిధులను చూస్తే ఆ రంగానికి ప్రభుత్వం ఇస్తున్న చిత్తశుద్ధి ఎలాంటితో అర్థమవుతుందన్నారు. ఈ బడ్జెట్‌లో సాగునీటిరంగానికి కేటాయించిన రూ. 11వేల కోట్లలో సగానికి పైగా కాళేశ్వరం ప్రాజెక్టు విద్యుత్ బిల్లులకే సరిపోతాయన్నారు. మిగిలిన సుమారు రూ. 5వేల కోట్ల రూపాయలతో కోటి ఎకరాల మాగాణి సాధ్యమవుతుందా అని ప్రశ్నించారు. పచ్చని తెలంగాణ సంగతేమోగానీ అప్పుల తెలంగాణగా తయారైందన్నారు. ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపితే తమ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు.

కానీ విపక్షాల ఆరోపణలను అధికార పార్టీ తిప్పికొట్టింది. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని, అందుకు సంక్షేమ పథకాల అమలే నిదర్శనమని గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. బడ్జెట్‌ను ప్రభుత్వం చాలా పకడ్బందీ వ్యూహంతో, దూరదృష్టితో రూపొందించిందన్నారు. మొత్తానికి ముగ్గురు సభ్యులు బడ్జెట్‌పై చేసిన ప్రసంగాలు, ప్రశ్నోత్తరాలు, జీరో అవర్‌కే సరిపోయాయి. గురువారం తెలుగుదేశం, బీజేపీ సభ్యుల చర్చ అనంతరం ఆర్థిక మంత్రి జవాబు ఇస్తారు. విపక్షాలు లేవనెత్తిన సందేహాలను ముఖ్యమంత్రి నివృత్తి చేస్తారు. అనంతరం బడ్జెట్‌కు సభ ఆమోదం తెలపనుంది.

Tags: Telangana, Budget, MIM, Akbaruddin, Congress, Mallu Bhatti, Mission Bhagiratha



Next Story

Most Viewed