కాలక్షేపంతో మొదలై.. వ్యసనంలా మారుతున్న సోషల్ మీడియా

by  |
Socal media
X

దిశ, ఫీచర్స్ : బాడీ టెంపరేచర్ పెరిగితే జ్వరం వచ్చినట్లు తెలిసిపోతుంది. దూరంగా ఉన్న వస్తువులు కనబడకపోతే ‘ఐ సైట్’ వచ్చినట్లు అర్థమవుతుంది. కానీ కొన్ని వ్యాధులు మాత్రం బయటకు ఎటువంటి లక్షణాలు కనబడనీయకుండా చాపకింద నీరులా శరీరాన్ని అనారోగ్యానికి గురిచేస్తుంటాయి. ‘సోషల్ మీడియా’ కూడా అచ్చం అలాంటిదే. ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా వినియోగం సర్వసాధారణం కాగా, అది ఓ వ్యసనంలా మారిందని గుర్తించేలోపే మన ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. దానికి ‘బానిస’లుగా మారిపోయామని తెలుసుకునేలోపే శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఈ నేపథ్యంలో ‘సైబర్ బులీయింగ్’ విపరీతంగా పెరిగిపోయిందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. కాగా సమస్యాత్మక సోషల్ మీడియా వాడకాన్ని ఎలా గుర్తించాలి? సైబర్ బులీయింగ్ నుంచి బయటపడేందుకు ఏం చేయాలి?

Likes

స్నేహితులు, బంధువులతో పాటు ప్రియమైనవారితో కనెక్ట్ అయ్యేందుకు, కాసేపు వారితో ముచ్చటించేందుకు సోషల్ మీడియా ఓ వేదిక. మొదట రెండు మూడు వీడియోల వీక్షణంతో ప్రారంభించి.. కాసేపు చాటింగ్, ఆపై స్టేటస్‌లు చూడటం, పెట్టిన పోస్ట్‌కు కామెంట్స్ చెక్ చేస్తూ.. చేస్తూ.. అంతర్జాలంలో లెక్కకు మించిన సమయాన్ని వెచ్చిస్తుంటాం. ఈ క్రమంలో తెలియకుండానే వాటికి అలవాటుపడిపోతుంటాం. ఇటీవల కాలంలో ఆన్‌లైన్ స్ర్కీనింగ్ టైమ్ విపరీతంగా పెరిగిపోగా.. పిల్లలు, టీనేజర్లతో పాటు మధ్య వయస్కులు కూడా సోషల్ మీడియాకు అడిక్ట్ అవుతున్నారు. కాలక్షేపంతో మొదలైన అభిరుచి కాస్త.. వ్యసనంలా మారిపోయింది. అయితే ఇతర వ్యసనాల వలెనే ఇది కూడా మెదడు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. సోషల్ మీడియా వాడకం ఎంత సాధారణమో, సోషల్ మీడియా వ్యసనానికి బలవుతున్న వారి సంఖ్య కూడా అంతే సాధారణంగా ఉందని మానసిక వైద్యులు సైతం చెబుతున్నారు. ఈ విపరీతమైన ధోరణి ‘సైబర్ బులీయింగ్’ (సైబర్ బెదిరింపు)‌కు దారితీస్తుందని తాజా పరిశోధనలు సూచిస్తున్నాయి. జార్జియా విశ్వవిద్యాలయం చేసిన అధ్యయనం ప్రకారం.. ఆన్‌లైన్‌లో ఎక్కువ గంటలు గడిపే టీనేజర్లలో సైబర్ బెదిరింపు సంబంధిత నేరప్రవృత్తి గణనీయంగా పెరిగిందని వెల్లడించింది.

Youth

‘వ్యక్తిగత దాడులు, వేధింపులు లేదా వివక్షత లేని ప్రవర్తన(డిస్క్రిమినేటరీ బిహేవియర్), పరువు నష్టం కలిగించే సమాచారాన్ని వ్యాప్తి చేయడం, ఆన్‌లైన్‌లో తనను తాను తప్పుగా చూపించడం, ప్రైవేట్ సమాచారాన్ని వ్యాప్తి చేయడం, సోషల్ ఎక్స్‌క్లూజన్, సైబర్‌స్టాకింగ్’ వంటి అనేక రూపాల్లో ఈ బెదిరింపులకు పాల్పడుతుంటారు. సోషల్ మీడియాకు బానిసలైన టీనేజర్లు ఆన్‌లైన్‌లో రోజుకు సగటున ఏడు గంటల టైమ్ కిల్ చేస్తుండగా, ఒక్క రోజులో ఆన్‌లైన్‌లో గడిపిన సగటు గరిష్ట గంటలు 12 గంటలకు పైగా నమోదయ్యాయి. రాత్రంతా నెట్‌లో స్క్రోలింగ్ చేస్తుండటంతో.. రోజంతా అలసిపోతున్నారు. ఆ ప్రభావంతో తల్లిదండ్రులతో విభేదిస్తూ గొడవ పడుతున్నారు. చదువు మీద కూడా శ్రద్ధ చూపించడం లేదు. ఆడవారి కంటే కౌమారదశలో ఉన్న మగవారు సైబర్ బెదిరింపులకు పాల్పడే అవకాశం ఎక్కువగా ఉందని ఈ అధ్యయనంలో వెల్లడైంది.

Addiction

సోషల్ మీడియా ‘రిలాక్సింగ్ ఫన్’ అందిస్తున్నా.. మెదడుపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇష్టమైన యాప్స్‌లో లాగిన్ అయినప్పుడల్లా, మెదడులోని డోపమైన్ సిగ్నల్స్ పెరుగుతాయి. దాంతో ఈ న్యూరోట్రాన్స్‌మీటర్ల వల్ల మనలో తెలియని ఆనందం కలుగుతుంది. అలా మెల్లగా సోషల్ మీడియాకు అడిక్ట్ అయిపోతాం. దాంతో హ్యాబీ కాస్త వ్యసనంలా మారిపోతుంది. ఇలాంటి ప్లెజెంట్ ఫీలింగ్ ఇతర వ్యసనాల్లోనూ కనిపిస్తుంది. ఇలా సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోగిస్తే.. ఆత్మన్యూనత భావన పెరిగి సెల్ఫ్ ఎస్టీమ్ తగ్గిపొతుంది. ఒంటరితనం, ఆందోళన, డిప్రెషన్ పెరిగిపోతాయి. ఎవరూ పట్టించుకోవడం లేదని, మరింతగా సోషల్ మీడియాకు అడిక్ట్ అవుతుంటారు. నిద్రలేమి ఎక్కువవుతుంది. ఫిజికల్ యాక్టివిటీ తక్కువవడంతో పాటు ఆకలి మందగిస్తుంది. రియల్ లైఫ్ రిలేషన్స్ కోల్పోతారు. ఇది క్రమంగా.. సైబర్ బెదిరింపులకు దారితీస్తుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రతీ పాఠశాల, కాలేజీల్లో విద్యార్థులకు సైబర్ బెదిరింపు, సోషల్ మీడియా వ్యసనాల గురించి పాఠాలు చెప్పడం ద్వారా వాటిపై అవేర్‌నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉందని మానసిక వైద్యులు సూచిస్తున్నారు.

study

ఇక ఈ వ్యసనాన్ని వదిలించుకోవాలంటే క్రమంగా స్మార్ట్‌ఫోన్ వాడకం తగ్గిస్తూ, అనవసర యాప్స్ అన్నీ డిలీట్ చేయాలి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఎక్కువగా టైమ్ స్పెండ్ చేయాలి. వ్యాయామానికి టైమ్ కేటాయించుకోవాలి. సోషల్ మీడియాకు స్పెసిఫిక్ టైమ్ ఫిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీవల్ల కాకపోతే మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించడానికి వెనుకాడొద్దు.


Next Story