మనుషులు గ్రీన్ సెక్స్ చేయకపోతే పర్యావరణానికి ముప్పే..!

by  |
మనుషులు గ్రీన్ సెక్స్ చేయకపోతే పర్యావరణానికి ముప్పే..!
X

దిశ, ఫీచర్స్ : జీవావరణ శాస్త్రానికి సంక్షిప్త రూపం ‘ఎకో’. అలాంటి పర్యావరణంతో జీవజాతులు ఏర్పరచుకున్న బంధం స్నేహపూర్వకమైంది మాత్రమే కాదు ఇరువురికి ప్రయోజనకరమైంది కూడా. ఇలాంటి వ్యవస్థకు ఏమాత్రం హాని కలిగించకపోవడం వల్ల మరింత లాభాలు పొందొచ్చు. కానీ మానవ చర్యల కారణంగా పర్యావరణానికి, తద్వారా జీవజాతులకు నష్టం వాటిల్లుతోంది. శిలాజ ఇంధనాల విచ్చలవిడి వినియోగం, అడవులు అంతరించడంతో పాటు మితిమీరిన ప్లాస్టిక్ వాడకం వంటి కారణాలు మానవాళికి పెనుముప్పుగా పరిణమిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పర్యావరణ కాలుష్యాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే పర్యావరణానుకూల ఉత్పత్తులను ప్రోత్సహించడం మన బాధ్యత. ఈ క్రమంలోనే ‘గోయింగ్ గ్రీన్’‌కు జనాదరణ పెరుగుతుండగా.. పడకగదిలోనూ ఎకో ఫ్రెండ్లీ విధానాన్ని అమలు చేయడం వల్ల పర్యావరణానికి మేలు చేయొచ్చు. పనితీరు లేదా ఆనందాన్ని త్యాగం చేయకుండా భూగ్రహాన్ని సంరక్షించుకోవాలంటే అడల్ట్ ప్రొడక్ట్స్, సెక్స్ టాయ్స్, కండోమ్స్ వాడకాన్ని తగ్గిస్తూ ‘ఎకో ఫ్రెండ్లీ’ సెక్స్ చేయడమే ఉత్తమం!

కార్బన్ ఫుట్‌ఫ్రింట్ లేదా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించగల వివిధ మార్గాల గురించి ఆలోచించినప్పుడు ఆ జాబితాలో ‘సెక్స్ లైఫ్’ గురించీ ఉంటుంది. అయితే దానివల్ల ఎకో సిస్టమ్‌కు హాని కలుగుతుందన్న విషయాన్ని మనం ఊహించం. నిజానికి గొప్ప అనుభూతిని కలిగించే సెక్స్.. కేలరీలను బర్న్ చేయడంతో పాటు మెగా ఎండార్ఫిన్స్‌ను అందిస్తుంది. నేచర్ ఎక్సర్‌సైజ్‌గానూ ఉపయోగపడుతుంది. కానీ ఆ రసజ్ఞ సమయంలో ఉపయోగించే ఉత్పత్తులతోనూ పర్యావరణానికి ప్రమాదం పొంచి ఉంది. ఆ అనవసర వ్యర్థాలు అందమైన ప్రకృతి దృశ్యాలను కాలుష్య కాసారంగా మార్చేయగలవు. నేచురల్ సెక్స్ వల్ల ఎలాంటి హాని ఉండదు కానీ సెక్స్‌కు తరచుగా ఉపయోగించే భౌతిక వస్తువులు.. ముఖ్యంగా జనన నియంత్రణ పరికరాలు(అవరోధ పద్ధతులు), కండోమ్స్, మాత్రలు, లూబ్రికెంట్స్, ప్లాస్టిక్ టాయ్స్ వంటివన్నీ భూమి తల్లిని ప్రభావితం చేస్తాయి. అందువల్ల జీవావరణ వ్యవస్థను రసాయనాలతో నిండిన జనన నియంత్రణ ఉప-ఉత్పత్తులతో నింపకుండా ‘గ్రీన్ సెక్స్’ను ఆశ్రయించడమే బెటర్.

విపరీతమైన నష్టం :

గర్భ నిరోధంతో పాటు అనేక సెక్స్ ట్రాన్స్‌మిటెడ్ ఇన్ఫెక్షన్స్(STIలు) నుంచి రక్షించడంలో కండోమ్స్ సాయపడతాయి. ఇవి చవకైనవే కాక అందరికీ అందుబాటులో ఉంటాయి. అయితే సింగిల్ యూజ్ ప్రొడక్ట్ అయిన కండోమ్స్ వాడకం వల్ల భూగ్రహానికి మరింత హాని కలుగుతోంది. యూఎన్ పాపులేషన్ ఫండ్ అంచనా ప్రకారం ప్రతి ఏటా సుమారు 10 బిలియన్ మేలా ల్యాటెక్స్ కండోమ్స్ అమ్ముడవుతున్నాయి. రీసైకిల్‌కు వీలులేని సింథటిక్ రబ్బర్‌తో తయారైన వాడిన తర్వాత బహిరంగ ప్రదేశాల్లో పడేయటం వల్ల కాలుష్యానికి కేరాఫ్‌గా మారుతున్నాయి. ఇక రోమన్ కాలం నుంచి ఉపయోగిస్తున్న లాంబ్‌స్కిన్ కండోమ్స్ పూర్తిగా బయోడిగ్రేడబుల్ అయినప్పటికీ అవి గొర్రెల పేగు నుంచి తయారవుతాయి. దీంతో ఇవి లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులను (STIs) నిరోధించలేవు. ఇక ‘పాలియురేతేన్’ కండోమ్స్ కూడా ప్లాస్టిక్‌తోనే తయారవుతాయి. కానీ దీని తయారీకి అవసరమయ్యే పెట్రోలియం.. గ్లోబల్ హీటింగ్ గ్రీన్‌హౌస్ వాయువులను ఉత్పత్తి చేస్తుంది. అయితే కొన్ని సంస్థలు మాత్రం పర్యావరణ అనుకూల కండోమ్స్ ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే జూన్ 2019లో లండన్‌లో ‘కండోమ్స్ కట్ కార్బన్’ అంటూ నిరసన వ్యక్తం చేశారు. 12,000 మంది నిరసనకారులు పెద్ద కండోమ్ వస్త్రాలు ధరించి, సమస్యను మరింత తీవ్రంగా పరిగణించాలని బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరారు.

లూబ్రికెంట్స్ అండ్ సెక్స్ టాయ్స్ :

సెక్స్ సమయంలో ఘర్షణ తగ్గించి ఆనందాన్ని పెంచేందుకు ఉపయోగించే ద్రవం లేదా జెల్‌ను లూబ్రికెంట్ (సంక్షిప్తంగా ల్యూబ్) అంటారు. అనేక లూబ్‌లు పెట్రోలియం ఆధారితమైనవే కాగా.. అవి శిలాజ ఇంధనాలను కలిగి ఉంటాయి. వాటర్, సిలికాన్, ఆయిల్, హైబ్రిడ్ వంటి ల్యూబ్స్ అందుబాటులో ఉంటాయి. అయితే ఇవన్నీ పర్యావరణానికి హాని చేసేవే. ఈ నేపథ్యంలోనే ఇంట్లో తయారుచేసిన ల్యూబ్స్‌ను ఉత్తమ ఎంపికగా చెప్పొచ్చు. ఉదాహరణకు మొక్కజొన్న పిండి నీటితో ఇంట్లోనే ‘లూబ్’ తయారుచేసుకోవచ్చు. వీటికి సంబంధించిన వీడియోలు కూడా యూట్యూబ్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇక సెక్స్ లైఫ్‌లో ప్లాస్టిక్ వాడకం విస్తృతంగా ఉపయోగించేది ‘సెక్స్ టాయ్స్’ విషయంలోనే. ఉక్కు లేదా గాజు ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉండగా.. బయోడిగ్రేడబుల్ టాయ్స్ కొనుగోలు చేసే ఎంపిక కూడా వ్యర్థాలను తగ్గించడంలో సాయపడుతుంది. అంతేకాదు మార్కెట్‌లో సౌరశక్తితో నడిచే సెక్స్ టాయ్స్ కూడా ఉన్నాయి. లవ్‌హనీ వంటి కంపెనీలు సెక్స్ టాయ్ అమ్నెస్టీని కూడా అందిస్తాయి. అవి సాధారణ రీసైక్లింగ్ మార్గాల ద్వారా పాత, విరిగిన బొమ్మలను రీసైక్లింగ్ చేయడంలో సాయపడతాయి.

వ్యర్థాలను ఎక్కడ తగ్గించవచ్చు?

లైంగిక జీవితంలో వ్యర్థాలను తగ్గించేందుకు తక్కువ స్కోప్ ఉంది. అయితే పర్యావరణహితంగా తయారు చేసిన లోదుస్తులు, క్లాత్స్ కొనుగోలు చేయడం, షవర్ సెక్స్‌ను నివారించడం, తక్కువ వేడి నీటిని ఉపయోగించడం, లైట్లు స్విచ్ ఆఫ్ చేయడం, పునర్వినియోగపరచదగిన వాష్‌క్లాత్‌లను ఎంచుకోవడం వంటివి ఎకో ఫ్రెండ్లీ సెక్స్‌ను బలోపేతం చేస్తాయి. భూగ్రహం మీద కాలుష్య ప్రభావాన్ని తగ్గించేందుకు ఇవి కొన్ని మార్గాలు. ఇక ప్యాకేజింగ్ విషయానికి వస్తే.. మనం కొనుగోలు చేసే చాలా వస్తువుల విషయంలో ‘ప్యాకేజింగ్’ తరచుగా వ్యర్థాలకు దారితీస్తుంది. కండోమ్స్, ల్యూబ్, గర్భనిరోధక మాత్రల విషయంలో ప్యాకింగ్ పర్యావరణ అనుకూలంగా ఉండటం ప్రధానం.

సెక్స్ లీడ్స్ టు బేబీస్ :

ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఏట దాదాపు 129 మిలియన్ పిల్లలు పుడుతుండగా, ఏడాదికి 18 బిలియన్ డైపర్లు అమ్ముడవుతున్నాయి. ఇందులో 90 శాతానికి పైగా భూమ్మీద బహిరంగ స్థలాల్లో కనిపిస్తాయి. బిడ్డల్ని కనే విషయంలో పరిమితి లేకపోవడం వల్ల కూడా అనేక సమస్యలు ఎదురవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. బ్రిటీష్ మెడికల్ జర్నల్ ది లాన్సెట్ ప్రకారం.. స్త్రీలు గర్భనిరోధకతను పొందాలనుకుంటున్నప్పటికీ దురదృష్టవశాత్తూ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 200 మిలియన్‌కు పైగా స్త్రీలకు ఆ హక్కు లేకపోవడంతో సంవత్సరానికి 76 మిలియన్ అనాలోచిత గర్భాలు సంభవిస్తున్నాయి. అయితే ఈ సంవత్సరం బ్రిటిష్ శాస్త్రవేత్తలు చేసిన గ్లోబల్ పోల్ సర్వేలో పాల్గొన్న 10,000 మంది యువకుల్లో మూడొంతుల మంది ‘భవిష్యత్తు భయానకంగా ఉంది’ అని అంగీకరించారు. దాదాపు 41% మంది రెస్పాండెంట్స్ వాతావరణ మార్పులను కారణంగా చూపుతూ ’పిల్లల్ని కనేందుకు వెనుకాడారు’. ప్రిన్స్ హ్యారీ 2019లో తనకు, డచెస్ ఆఫ్ సస్సెక్స్‌కు ‘గరిష్టంగా’ ఇద్దరు పిల్లలు ఉంటారని, ఈ నిర్ణయం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే ‘గ్రీన్ పేరెంట్స్’ ఆవశ్యకత పెరిగింది. అయితే కొందరు మాత్రం పిల్లలు కనడాన్ని వారు స్వేచ్ఛగా నిర్ణయించుకునే మానవ హక్కుగా అభివర్ణించారు.

పర్యావరణ అనుకూలంగా ఉండేందుకు చాలా సమయం, కృషితో పాటు డబ్బు అవసరమని ప్రజలు భావిస్తారు. అయితే పర్యావరణానికి ఊపిరిలూదడానికి మనవంతు ప్రయత్నం కూడా తోడైతే కొంతలో కొంతైనా మార్పు చూడగలం. ఇకపై మనం భూమి సంరక్షకులుగా.. ఎకో ఫ్రెండ్లీ పద్ధతులను పాటిస్తూ, వ్యర్థాలను నివారిస్తూ ముందుకు సాగిపోవాలని కోరుకుంటున్నాం.
– శ్రవణ్ కుమార్ పత్తిపాక


Next Story

Most Viewed