దొంగగా మారిన గ్రాఫిక్ డిజైనర్

by  |
Dubbaka si
X

దిశ, దుబ్బాక : దుబ్బాక మండలం లో గత రెండు నెలల క్రితం రెండు పాఠశాలలో కంప్యూటర్ సామాగ్రిని ఎత్తుకెళ్లిన దొంగను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన శుక్రవారం దుబ్బాక బస్టాండ్ వద్ద జరిగింది. దుబ్బాక ఎస్ఐ స్వామి తెలిపిన వివరాల ప్రకారం.. దుబ్బాక పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, లచ్చపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండు నెలల క్రితం కంప్యూటర్లు, ప్రింటర్లు, మదర్ బోర్డ్, డిజిటల్ కీ బోర్డు చోరీకి గురయ్యాయి.

ఈ దొంగతనంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా శుక్రవారం దుబ్బాక బస్టాండ్ ప్రాంతంలో చేతిలో బ్యాగు పట్టుకొని అనుమానాస్పదంగా తిరుగుతున్న దుబ్బాకకు చెందిన కాల్వ సురేష్ ను పోలీసులు పట్టుకున్నారు. సంచిని తనిఖీ చేయగా, కంప్యూటర్ సామాగ్రి దొరికాయి. వాటిపై ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెబుతుండటంతో పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి, విచారించారు. దీంతో నిందితుడు నిజం కక్కాడు. గతంలో రెండు పాఠశాలల్లో దొంగతనం చేసింది తానేనని అంగీకరించాడు. వెంటనే పోలీసులు నిందితుడు చోరీ చేసిన కంప్యూటర్లు, సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

నిందితుడు దుబ్బాకలో గ్రాఫిక్స్ షాపు నిర్వహిస్తూ మద్యానికి బానిసై, పలు దొంగతనాలకు పాల్పడ్డాడని విచారణలో తేలిందన్నారు. శుక్రవారం నిందితుడిని కోర్టులో హాజరు పరచి రిమాండ్ కు తరలిస్తున్నట్లు దుబ్బాక ఎస్ఐ స్వామి తెలిపారు.



Next Story

Most Viewed