మరి నోటా సంగతేంటీ !

by  |
మరి నోటా సంగతేంటీ !
X

దిశ, ఏపీ బ్యూరో : “అధికార ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుకొని ఏకగ్రీవాలు చేసుకోవడం బాగానే ఉంది. మా డివిజన్​లో పోటీకి సిద్ధమైన వాళ్లెవరూ నాకు నచ్చలేదు. నేను నోటాకు ఓటెయ్యాలనుకుంటున్నా. మరి నా సంగతేంటీ ! ” అంటూ ఓ మిత్రుడు పాయింట్​లేవదీశాడు. గతంలో నోటా లేదు. ఎవరో ఒకరికి ఓటెయ్యాల్సిందే. ఎన్నికల సంస్కరణల్లో భాగంగా ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పోటీ చేసిన అభ్యర్థులెవరూ నచ్చకపోతే నోటాకు ఓటేసే అవశాకం ఎన్నికల సంఘం కల్పించింది. మరి అలాంటప్పుడు ఏకగ్రీవాల పేరుతో నోటాకు ఓటేసే అవకాశాన్ని కోల్పోవడమే అవుతుంది. దీన్ని కూడా ఎన్నికల నేరం కింద పరిగణించాల్సి వస్తుంది.

మొన్నటి గ్రామ పంచాయతీల నుంచి ఇప్పటి మున్సిపల్​ఎన్నికలదాకా ఏకగ్రీవాల పండగ నడుస్తోంది. ఒకప్పుడు ఏకగ్రీవమంటే ఆయా ప్రాంతానికి లేదా గ్రామానికి సంబంధించిన ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి ఓ అభ్యర్థిని నిర్ణయిస్తే దాన్ని ఏకగ్రీవ ఎన్నికగా పేర్కొనేది. ఇప్పుడు ఏకగ్రీవాలకు అర్థం మారిపోయింది. నామినేషన్ల ఉపసంహరణ రోజునే బేరసారాలు జరిగిపోతున్నాయి. కొన్నింటిని బలవంతంగా ఉపసంహరింపజేస్తే.. మరికొన్నిటిని బుజ్జగింపుతో విత్​డ్రా చేయించారు. ఇంకొన్నింటికి బేరసారాలతో ముగింపు పలికారు. బలవంతంగా నామినేషన్లను ఉపసంహరించడం, అభ్యర్థుల బదులు వేరే వాళ్లు ఫోర్జరీ సంతకాలతో విత్​డ్రా చేయడం పై ఎన్నికల సంఘం సీరియస్​అయింది. తిరుపతిలోని ఏడో డివిజన్​లో ఎన్నికల ప్రక్రియను రద్దు చేసింది.

దీంతో ఏకగ్రీవంగా కార్పొరేటర్​అయిన నాయకుడు మళ్లీ కోర్టుకెళ్లాడు. వీళ్లంతా న్యాయస్థానాలు చుట్టూ తిరుగుతుంటే.. పోటీ జరిగే స్థానాలు తగ్గిపోతున్నాయని ఓటర్లు శివాలెత్తుతున్నారు. “పోటీలో ఉంటే అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు ఓటుకు ఇంతని ఇచ్చేవాళ్లు. ఆ అవకాశం పోయింది. మళ్లీ ఐదేళ్లదాకా వీళ్లు మా మొహం చూడరు. వాళ్ల లోపాయికారి ఒప్పందానికి మేమెందుకు ఒప్పుకోవాలి ” అంటూ తిరుపతిలోని ఓ డివిజన్ ఓటర్లు నాయకులను నిలదీస్తున్నారంటా. ఏకగ్రీవాలపై నోటా ఓటర్లు, నజరానా కోల్పోతున్నామని బాధపడే ఓటర్లు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేయడానికి సిద్ధమవుతున్నారు. వాళ్ల ఫిర్యాదులపై ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే మరి.


Next Story

Most Viewed