‘బీమా’తో నేతన్నలకు ధీమా.. 2500 మంది కార్మికులకు బెనిఫిట్

by  |
‘బీమా’తో నేతన్నలకు ధీమా.. 2500 మంది కార్మికులకు బెనిఫిట్
X

దిశ, సిద్దిపేట : రైతు బీమా మాదిరిగానే చేనేత బీమా అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించడం పట్ల నేత కార్మికుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. సర్కారు బీమా పథకం నేతన్న కుటుంబానికి ధీమాగా మారనుంది. సిద్దిపేట జిల్లాలో ఈ పథకం ద్వారా 2,500కు పైగా కార్మికులకు ప్రయోజనం చేకూరనుంది. రాష్ట్రంలోని రైతులు ఏ కారణంతో మరణించినా వారిపై ఆధారపడ్డ కుటుంబసభ్యులకు ఆర్థిక సాయం అందించే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం రైతు బీమా పథకం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. రైతు మరణిస్తే అతని నామినీ పేరిట ఉన్న బ్యాంకు అకౌంట్‌లో రూ. 5 లక్షలు జమ చేస్తున్నారు. ప్రస్తుతం కేవలం రైతులకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ పథకాన్ని ప్రభుత్వం త్వరలోనే చేనేత కార్మికులకు సైతం అందుబాటులోకి తీసుకురానుంది.

గతంలో సిరిసిల్ల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ పథకం అమలైతే జిల్లాలోని వివిధ చేనేత సహకార సంఘాల్లో పనిచేస్తున్న రెండు వేలకు పైగా కార్మికుల కుటుంబాలకు భరోసా లభించనుంది. సిద్దిపేట జిల్లాలో ఆరు చేనేత సహకార సంఘాలు 530 మంది సభ్యులతో కొనసాగుతున్నాయి. ఈ సంఘాల ఆధ్వర్యంలో రెండు వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరందరికీ చేనేత బీమాతో మేలు జరగనున్నది.

3 వేల మంది కార్మికులకు భరోసా..

గత రెండేళ్లుగా కరోనా నేపథ్యంలో చేనేత రంగానికి తీవ్ర నష్టం వాటిల్లింది. సిద్దిపేట జిల్లాలో దాదాపు 3 వేల మంది కార్మిక కుటుంబాలు ఈ వృత్తిని నమ్ముకుని జీవిస్తున్నాయి. వారందరూ ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులతో అతికష్టంగా నెట్టుకొస్తున్నారు. కుటుంబ పెద్దకు ఏదైనా ప్రమాదం చోటుచేసుకుని పనిచేయలేకపోతే కుటుంబ సభ్యులు పస్తులుండాల్సిన పరిస్థితి. నేత కార్మికుడు మరణిస్తే కుటుంబాలు చిన్నాభిన్నమైన ఘటనలు అనేకం ఉన్నాయి. బీమా పథకం అమలైతే వీరందరికీ భరోసా లభించనున్నది. జౌళి శాఖ రికార్డుల ప్రకారం జిల్లాలో చేనేత సహకార సంఘాల్లో 530 మందికి సభ్యత్వం ఉన్నది. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్‌, హుస్నాబాద్‌ నియోజకవర్గాల్లో చేనేత, అనుబంధ రంగాల్లో రెండు వేల మంది పనిచేస్తున్నారు. వీరిలో కొంతమందికి మాత్రమే గుర్తింపు కార్డులు ఉన్నాయి. అనేక మందికి గుర్తింపు కార్డులు లేక ఇబ్బందులు పడుతున్నారు. గుర్తింపు కార్డులు అందిస్తే తమకు బీమా సౌకర్యం పొందే అవకాశం ఉంటుందని వారు కోరుతున్నారు. బీమా పథకం అమలుకోసం అధికారులు కసరత్తు ప్రారంభించిన నేపథ్యంలో అర్హులను గుర్తించి, గుర్తింపు కార్డులు అందజేసే అవకాశమున్నది.


Next Story

Most Viewed