- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వ్యవసాయంలో మార్పులకు సిద్ధంకావాలి: మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు
రాష్ట్రంలో ఎల్-నినో ప్రభావంతో రైతులను ముందుగానే అప్రమత్తం చేసి ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించాలని అధికారులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు...

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఎల్-నినో ప్రభావంతో రైతులను ముందుగానే అప్రమత్తం చేసి ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించాలని అధికారులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ నెల 4, 6, 8, 10 తేదీలలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలు నిర్వహించాలని సూచించారు. రైతులకు తక్కువ నీటితో సాగు చేయగల పంటలు, వర్షాభావాన్ని తట్టుకునే పంటలు, ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానాలపై గ్రామసభల ద్వారా విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.గురువారం సచివాలయంలో వ్యవసాయశాఖ, ఉద్యానశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి లిఫ్ట్ ఇరిగేషన్, బోరు బావులు ఆధారిత సాగు ప్రాంతాలలో తక్కువ పంటకాలం కలిగిన సన్నరకం వరి రకాలను ప్రోత్సహించడంతో పాటు ఆరుతడి పంటల సాగుపై రైతులను దృష్టి సారింపజేయాలని పేర్కొన్నారు.
వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు పంటల ఎంపిక చేసుకునేలా వ్యవసాయ విస్తరణ సిబ్బంది క్షేత్రస్థాయిలో పనిచేయాలన్నారు. పంట వ్యర్థాలను కాల్చివేయడం వల్ల నేల సారవంతత దెబ్బతినడంతో పాటు పర్యావరణ కాలుష్యం పెరుగుతుందని, నాగర్‌కర్నూల్ జిల్లాలో పంట వ్యర్థాల కాల్చివేతలకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలు పరిశీలించారు. ఇదే విధంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి శాటిలైట్ ఆధారిత నివేదికలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 6వ తేదీన కొహెడలో రూ.2,284.32 కోట్ల వ్యయంతో నిర్మించనున్న అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్‌కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారని, ఇది రాష్ట్ర మార్కెటింగ్ రంగానికి మైలురాయిగా నిలుస్తుందన్నారు.
వ్యవసాయశాఖ పరిధిలోని వివిధ విభాగాలకు చెందిన ఖాళీ స్థలాలను ఇప్పటికే గుర్తించామని, ఈ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. ఇందుకోసం నెల రోజుల వ్యవధిలో ఐఏఎస్ అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి, ఆస్తుల పరిరక్షణకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. ఖాళీ స్థలాలను లీజుకు ఇచ్చి ఆదాయ వనరులు సమకూర్చుకునే అవకాశాలను పరిశీలించాలని, అది సాధ్యంకాని చోట్ల విస్తృత స్థాయిలో ప్లాంటేషన్ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
తెలంగాణ ఫెర్టిలైజర్ యాప్‌కు మరోసారి కేంద్రం ప్రశంసలు
రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఫెర్టిలైజర్ యాప్ పనితీరును కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ మరోసారి ప్రశంసించిందని మంత్రి తెలిపారు. ఎరువుల పంపిణీ, వినియోగ పర్యవేక్షణలో తెలంగాణ అమలు చేస్తున్న విధానం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఫెర్టిలైజర్ యాప్‌ను రాష్ట్రంలోని పైలట్ జిల్లాల్లో సమర్థవంతంగా అమలు చేయాలని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ కార్యదర్శి కోరినట్లు తెలిపారు. భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ యాప్ అమలు దిశగా చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించిందన్నారు. యాప్‌ను సమర్థవంతంగా అమలు చేస్తే రాష్ట్రానికి ప్రోత్సాహకాలు కూడా అందజేస్తామని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ హామీ ఇచ్చినట్లు మంత్రి వెల్లడించారు.






