- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాంపూర్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీకి విఫలయత్నం
మండలంలోని రాంపూర్ గ్రామ శివారు ప్రాంతంలో ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో బుధవారం అర్ధరాత్రి దొంగలు చోరీకి యత్నించారు.

దిశ, తలకొండపల్లి : మండలంలోని రాంపూర్ గ్రామ శివారు ప్రాంతంలో ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో బుధవారం అర్ధరాత్రి దొంగలు చోరీకి యత్నించారు. అయితే హుండీ తలుపులు తెరుచుకోకపోవడంతో వారి ప్రయత్నం విఫలమైంది. గురువారం ఉదయం ఆలయ అర్చకుడు సీహెచ్ నరసింహాచారి నిత్య పూజల కోసం దేవాలయానికి వెళ్లగా, ఆలయం వెనుక వైపు ఉన్న ప్రవేశ ద్వారం తాళాలు విరగొట్టి ఉండటాన్ని గుర్తించారు. వెంటనే స్థానికులు, గ్రామ సర్పంచ్ నిర్మల శ్రీశైలం యాదవ్‌కు సమాచారం అందించారు. అనంతరం సర్పంచ్ పోలీసులకు సమాచారం ఇవ్వగా, ఎస్ఐ శేఖర్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. దర్యాప్తులో భాగంగా దొంగలు హుండీ తాళాలు కూడా పగులగొట్టేందుకు ప్రయత్నించినప్పటికీ, హుండీ తలుపులు తెరుచుకోకపోవడంతో నగదు అపహరించకుండా అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. నిందితులను గుర్తించేందుకు క్లూస్ టీంను రంగంలోకి దించారు. తర్వాత ఆలయ ఈవో స్నేహలత సమక్షంలో హుండీని తెరిచి నగదు లెక్కించగా, అందులో సుమారు రూ.8 వేల వరకు నగదు ఉన్నట్లు వెల్లడైంది. ఈ సందర్భంగా ఎస్ఐ శేఖర్ మాట్లాడుతూ, దేవాలయాలు సహా ప్రజా ప్రాధాన్యత ఉన్న ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పలుమార్లు సూచిస్తున్నప్పటికీ తగిన స్పందన రావడం లేదన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు నివారించేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీలు సీసీ కెమెరాల ఏర్పాటు కోసం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో స్నేహలత, ఉప సర్పంచ్ ఆంజనేయులు, ముదిరాజ్ సంఘం నాయకులు శేఖర్, పాండు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.






