- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తాళం వేసిన ఇళ్లే టార్గెట్.. బంగారం, వెండి, నగదుతో పరార్
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని భవానీనగర్‌లో భారీ చోరీ ఘటన చోటుచేసుకుంది.

దిశ, కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని భవానీనగర్‌లో భారీ చోరీ ఘటన చోటుచేసుకుంది. ఇంటి యజమానులు వైద్య పరీక్షల నిమిత్తం ఖమ్మం వెళ్లిన అవకాశాన్ని గమనించిన దుండగులు ఇంట్లోకి చొరబడి బంగారం, వెండి, నగదును అపహరించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాధితుల వివరాల ప్రకారం.. గత నెల 30వ తేదీన కుటుంబ సభ్యులు ఆరోగ్య పరీక్షల కోసం ఖమ్మం వెళ్లారు. ఇంటికి తాళం వేసి వెళ్లిన విషయాన్ని గమనించిన ఇద్దరు గుర్తుతెలియని దొంగలు రాత్రి సమయంలో ఇంటి ప్రధాన తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు.
అనంతరం ఇంట్లోని గదులన్నింటినీ జల్లెడ పట్టి, కబోర్డులు, అల్మారాలు తెరిచి సామగ్రిని చిందరవందర చేశారు. ఈ క్రమంలో కబోర్డ్‌లో భద్రపరిచిన తులంన్నర బంగారం, 60 తులాల వెండి ఆభరణాలు, రూ.15 వేల నగదును ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. దొంగలు అత్యంత చాకచక్యంగా వ్యవహరించి విలువైన వస్తువులను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. చికిత్స అనంతరం ఈరోజు ఇంటికి చేరుకున్న బాధితులు ఇంటి తలుపులు ధ్వంసమైన స్థితిలో ఉండటం, సామగ్రి చిందరవందరగా కనిపించడంతో దిగ్భ్రాంతికి గురయ్యారు.
వెంటనే ఇంట్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా ఇద్దరు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి చోరీకి పాల్పడిన దృశ్యాలు రికార్డైనట్లు గుర్తించారు. దీంతో బాధితులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనపై విచారణ చేపట్టి ఆధారాలు సేకరించారు. సీసీ కెమెరాల ఫుటేజీని స్వాధీనం చేసుకుని, దొంగల కదలికలు, వారి గుర్తింపు పై ప్రత్యేక దృష్టి సారించారు. చోరీకి పాల్పడిన వ్యక్తులను త్వరలోనే గుర్తించి పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. భవానీనగర్‌లో జరిగిన ఈ ఘటనతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ, కాలనీల్లో పోలీసు గస్తీని మరింత పెంచాలని కోరుతున్నారు.






