అంగన్వాడీ సెలవులు పొడగింపు : ప్రభుత్వం ఉత్తర్వులు

by Muthe.Rajitha |

తెలంగాణ వ్యాప్తంగా తీవ్రత కొనసాగుతుండటంతో అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులను పొడిగిస్తునట్టు ప్రభుత్వం ప్రకటించింది.

అంగన్వాడీ సెలవులు పొడగింపు : ప్రభుత్వం ఉత్తర్వులు
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ వ్యాప్తంగా తీవ్రత కొనసాగుతుండటంతో అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులను పొడిగిస్తునట్టు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన వేసవి సెలవులను జూన్ 13 వరకు పొడిగిస్తూ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి ముందస్తుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 2వ తేదీ నుంచే అంగన్వాడీ కేంద్రాలు తిరిగి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, జూన్ మొదటి వారంలో కూడా ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలోనే నమోదవుతుండటంతో చిన్న పిల్లలు, గర్భిణీలు, బాలింతలు తీవ్రమైన వడదెబ్బకు గురికాకూడదని ప్రభుత్వం ఈ సెలవులను పొడిగించింది. జూన్ 13 వరకు సెలవులు పొడిగించిన నేపథ్యంలో, మరుసటి రోజు జూన్ 14 ఆదివారం కావడంతో రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలు తిరిగి జూన్ 15 నుండి యథావిధిగా పునఃప్రారంభం కానున్నాయి.

కేంద్రాలకు వచ్చే చిన్నారులు మరియు తల్లులకు మాత్రమే సెలవులు ప్రకటించినప్పటికీ, అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు ప్రభుత్వం కొన్ని కీలకమైన విధులను అప్పగించింది. ఈ సెలవుల సమయంలో లబ్ధిదారులకు అందాల్సిన పోషకాహార సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా అంగన్వాడీ సిబ్బంది క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా వారు తమ పరిధిలోని గ్రామ పరిమితుల్లో ఇంటింటి సర్వే నిర్వహించడంతో పాటు, గర్భిణీలు, బాలింతలు, చిన్న పిల్లలకు అందాల్సిన టేక్ హోమ్ రేషన్ (THR), ఇతర బలవర్ధక ఆహార పదార్ధాలను నేరుగా వారి ఇళ్లకే వెళ్లి పంపిణీ చేయాల్సి ఉంటుంది. అలాగే స్థానిక ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలతో కలిసి గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య పర్యవేక్షణ కార్యక్రమాలను కూడా పర్యవేక్షించాల్సి ఉంటుంది.

Next Story