Weather: సుర్రుమంటున్న సురీడు.. హెచ్చరిస్తున్న వాతావరణ శాఖ

by Yella Dhawani Reddy |   (  Updated:2025-02-07 03:51:09  IST  )

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. చలి తగ్గటంతో సురీడు సుర్రుమంటున్నాడు.

Weather: సుర్రుమంటున్న సురీడు.. హెచ్చరిస్తున్న వాతావరణ శాఖ
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. చలి తీవ్రత తగ్గటంతో సురీడు సుర్రుమంటున్నాడు. పగటి ఉష్ణోగ్రతలు (Daytime temperatures) క్రమంగా పెరుగుతుండటంతో ఉక్కపోత మొదలైంది. గతేడాది మార్చి నెలాఖరులో నమోదైన ఉష్ణోగ్రతలు ఇప్పుడు ఫిబ్రవరి మొదటి వారంలోనే రికార్డు అవ్వటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడే ఎండలు 37 డిగ్రీలు దాటితే ఏప్రిల్‌, మే నెలల్లో రికార్డు స్థాయిలో నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. ఎండ తీవ్రతకు నిత్యం జనంతో రద్దీగా ఉండే రోడ్లన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. ఇక గతేడాది అత్యంత వేడి సంవత్సరంగా (As the hottest year) రికార్డు అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వేసవిలోనూ అదే తరహాలో ఉష్ణోగ్రతలు భారీగా రికార్డయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇక ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో పాటు ఫ్యాన్లు, ఏసీలు, కూలర్ల వినియోగం భారీగా పెరిగిపోతుంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా గురువారం ఒక్కరోజే అత్యధికంగా రికార్డు స్థాయిలో (A record high) 15,752 మెగావాట్ల విద్యుత్ వినియోగం (Power consumption) అయింది. దీంతో గత ఏడాది మార్చి 8న నమోదైన అత్యధికంగా 15,623 మెగావాట్ల డిమాండ్‌ను ఇది అధిగమించినట్లు విద్యుత్​శాఖ ప్రకటించింది. వ్యవసాయానికి, పరిశ్రమలకు విద్యుత్ వినియోగం పెరగడంతో పాటు గృహ వినియోగం భారీగా పెరగంతోనే అత్యధికంగా విద్యుత్ డిమాండ్ నమోదు అయినట్లు తెలిపింది. ఇక ఈ ఏడాది విద్యుత్ డిమాండ్ 17,000ల మెగావాట్లకు చేరుకుంటుందని అంచనావేస్తుంది.

పెరుగుతున్న ఎండల నేపథ్యంలో ప్రజలు సరైన జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా బయటి ఆహారం జోలికి వెళ్లకపోవడమే ఉత్తమమని అంటున్నారు. శరీరంలో నీటిశాతం పెంచే తాజా పండ్లను అధికంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. చిన్న పిల్లలు, వృద్ధుల విషయంలో జాగ్రత్తలు పాటించాలంటున్నారు. మజ్జిగ, కొబ్బరి నీరు, రాగి జావ తాగిస్తే మంచిదంటున్నారు.

ఇక గురువారం ఏపీలో క‌ర్నూలు జిల్లాలోని సి.బెల‌గల్‌లో 35.9 సెల్సియ‌స్ ఉష్ణోగ్రతలు, తెలంగాణలోని మెదక్‌ జిల్లాలో 35.8 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు న‌మోద‌య్యాయి.

Next Story