తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్: రానున్న 3 రోజుల్లో భారీ వర్షాలు!

by Kema Shiva Kumar |

తెలంగాణలో రాగల మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్:  రానున్న 3 రోజుల్లో భారీ వర్షాలు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో ఎండ తీవ్రత తగ్గి, ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజుల కిందటి వరకు 43 డిగ్రీలు దాటిన గరిష్ఠ ఉష్ణోగ్రతలు.. ప్రస్తుతం 34 నుండి 39 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. రాగల మూడు రోజుల్లో ఈ ఉష్ణోగ్రతలు మరో 2 నుండి 5 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇదే సమయంలో రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు మరియు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

వర్ష సూచన ఉన్న జిల్లాలు..

ఆదిలాబాద్, కుమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మరియు కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

జైనూరు, సారంగపూర్‌లో 7 సెం.మీ వర్షం..

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గణనీయమైన వర్షపాతం నమోదైంది. కుమరం భీం జిల్లా జైనూరులో 7 సెంటీమీటర్లు, పెద్దపల్లి జిల్లా సారంగపూర్‌లో 7 సెంటీమీటర్లు, ములుగు జిల్లా గోవిందరావుపేటలో 5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నిర్మల్ జిల్లాలోని నర్సాపూర్‌లో 5.1, లోకేశ్వరంలో 4.4, సారంగపూర్‌లో 4.4, భైంసాలో 4.3, నిర్మల్‌లో 3.6 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. అలాగే వరంగల్ జిల్లా నల్లబెల్లిలో 4 సెంటీమీటర్ల వర్షం పడింది.

జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలో..

హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో కూడా వాతావరణం చల్లబడింది. రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌లో 2.6 సెంటీమీటర్లు, అబ్దుల్లాపూర్‌మెట్‌లో 1.6 సెంటీమీటర్లు, హయత్‌నగర్‌లో 1.5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

Next Story