కోర్టుల చుట్టూ హెచ్‌సీఏ పంచాయితీ.. వన్మ్యా న్ కమిటీపై క్లబ్‌ల తీవ్ర అభ్యంతరం

by Kema Shiva Kumar |   (  Updated:2026-06-24 17:13:16  IST  )

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అవినీతిపై సిట్ దర్యాప్తు, వన్-మ్యాన్ కమిటీ నియామకంపై క్రికెట్ క్లబ్‌లు హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించాయి.

కోర్టుల చుట్టూ హెచ్‌సీఏ పంచాయితీ.. వన్మ్యా న్ కమిటీపై క్లబ్‌ల తీవ్ర అభ్యంతరం
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)లో సాగుతున్న అంతర్గత పోరు, ఆర్థిక అక్రమాల వ్యవహారం ఇప్పుడు హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ముందుకు చేరింది. అసోసియేషన్ వ్యవహారాలను పర్యవేక్షించడానికి సింగిల్ మెంబర్ కమిషన్‌ను నియమించడంతో పాటు, భారీ ఎత్తున జరిగినట్లు ఆరోపణలు వస్తున్న ఆర్థిక అక్రమాలపై ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT) ఏర్పాటు చేయాలని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ పలు క్రికెట్ క్లబ్‌లు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ అప్పీళ్లపై బుధవారం విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.హరిప్రసాద్‌లతో కూడిన డివిజన్ బెంచ్.. సమగ్ర వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని హెచ్‌సీఏను, పిటిషనర్లను ఆదేశించింది.

వన్ మ్యాన్ కమిటీపైనే ప్రధాన అభ్యంతరం..

గతంలో హెచ్‌సీఏలో నిధుల దుర్వినియోగం, ఆర్థిక అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. రాష్ట్ర సీఐడీ ద్వారా 'సిట్' ఏర్పాటు చేసి దర్యాప్తు చేయాలని ఆదేశించారు. ఈ దర్యాప్తు ముగిసే వరకు హెచ్‌సీఏ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు హైకోర్టు మాజీ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎ. నవీన్ రావును వన్-మ్యాన్ కమిటీగా నియమించారు. అయితే, ఈ నిర్ణయాన్ని ఎస్.ఎ.అంబర్‌పేట్ క్రికెట్ క్లబ్, జిందా తిలిస్మాత్ క్లబ్, సాగర్ క్రికెట్ క్లబ్‌లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అప్పీలు చేసిన క్లబ్‌ల తరపున సీనియర్ కౌన్సెల్ (Counsel) పి. రఘురామ్ వాదనలు వినిపిస్తూ.. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కమిటీని పక్కన పెట్టి, పరిపాలనను పూర్తిగా కోర్టు నియమించిన కమిటీ చేతుల్లోకి తీసుకోవడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ఎవరో కొందరు చేసిన తప్పులకు మొత్తం కమిటీని బాధ్యులను చేయడం సరికాదని, కోర్టుల జోక్యం కేవలం నేరారోపణల దర్యాప్తు వరకే పరిమితం కావాలని ఆయన ధర్మాసనానికి విన్నవించారు. ఈ న్యాయపోరాటాల వల్ల అసలైన క్రికెట్ ఆనందం ఇప్పుడు మైదానాల నుంచి కోర్టుల చుట్టూ తిరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

హెచ్‌సీఏ కౌంటర్.. క్లబ్‌లకు అన్నీ తెలుసు

మరోవైపు హెచ్‌సీఏ తరపున హాజరైన న్యాయవాది (Counsel) ఈ అప్పీళ్లను తోసిపుచ్చారు. అసోసియేషన్‌లో మొత్తం 150కి పైగా సభ్య క్లబ్‌లు ఉంటే, కేవలం 11 క్లబ్‌లు మాత్రమే ఇప్పుడు కోర్టు ముందుకు వచ్చాయని గుర్తుచేశారు. ఈ విచారణల గురించి సభ్య క్లబ్‌లన్నింటికీ ముందే తెలుసని, అప్పుడు స్పందించకుండా ఇప్పుడు అభ్యంతరాలు చెప్పడం సరికాదని వాదించారు. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు అసోసియేషన్ ప్రక్షాళనకు అవసరమని హెచ్‌సీఏ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఇరుపక్షాల వాదనలు విన్న డివిజన్ బెంచ్.. సింగిల్ జడ్జి ముందు పిటిషన్ వేసిన సఫిల్‌గూడ క్రికెట్ క్లబ్‌ను కూడా కౌంటర్ దాఖలు చేయాలని కోరింది. అప్పీలు చేసిన క్లబ్‌లకు ఈ కౌంటర్లపై సమాధానం ఇవ్వడానికి వారం రోజుల సమయం ఇస్తూ, తదుపరి విచారణను జూలై 21కి వాయిదా వేసింది.

తాత్కాలిక అధ్యక్షుడిగి దల్జీత్ సింగ్‌కు బాధ్యతలు

హెచ్‌సీఏలో గత కొద్ది రోజులుగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జూన్ 8న హెచ్‌సీఏ అధ్యక్షుడిగా అమర్‌నాథ్ నియామకాన్ని హైకోర్టు రద్దు చేస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. ఆ పదవికి కొత్తగా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశిస్తూనే, కొత్త అధ్యక్షుడు ఎన్నికయ్యే వరకు వైస్ ప్రెసిడెంట్ దల్జీత్ సింగ్ తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తారని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత సిట్ దర్యాప్తు, వన్-మ్యాన్ కమిటీ పర్యవేక్షణపై జూలై 21న ధర్మాసనం వెలువరించే తీర్పు హెచ్‌సీఏ భవిష్యత్తును నిర్ణయించనుంది. తదుపరి విచారణ నాటికి ఇరుపక్షాల న్యాయవాదులు తమ కేసులకు సంబంధించిన పూర్తి సమగ్ర రికార్డులను సమర్పించాలని కోర్టు ఆదేశించింది.

Next Story