- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నగర తాగునీటి అవసరాలకు భరోసా.. గోదావరి ఫేజ్-II, III పనులపై జలమండలి ఎండీ క్షేత్రస్థాయి సమీక్ష
హైదరాబాద్ భవిష్యత్ తాగునీటి అవసరాల కోసం చేపట్టిన గోదావరి ఫేజ్-II, III పనులను జలమండలి ఎండీ అశోక్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ నగర ప్రజల భవిష్యత్ తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గోదావరి తాగునీటి సరఫరా ప్రాజెక్టు ఫేజ్-II, III పనులను జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ (MD) అశోక్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మల్లన్నసాగర్ వద్ద నిర్మాణంలో ఉన్న పంప్ హౌస్ పనులతో పాటు, 3000 మిల్లీమీటర్ల (ఎంఎం) వ్యాసం గల ప్రధాన పైప్‌లైన్ నిర్మాణ పనుల పురోగతిని ఆయన నిశితంగా సమీక్షించారు. ప్రాజెక్టు పరిధిలో జరుగుతున్న వివిధ రకాల నిర్మాణ కార్యకలాపాలను పరిశీలించిన ఎండీ.. పనుల నాణ్యత, భద్రతా ప్రమాణాలపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
సెప్టెంబర్ 2027 నాటికి ప్రాజెక్ట్ పూర్తికావాలి..
ప్రాజెక్టు పనులను మరింత వేగవంతం చేయడానికి అవసరమైన అదనపు సిబ్బందిని, అత్యాధునిక యంత్రాలను వెంటనే సమకూర్చుకోవాలని సంబంధిత నిర్మాణ సంస్థ (ఏజెన్సీ) ప్రతినిధులను అశోక్ రెడ్డి ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువు ప్రకారం సెప్టెంబర్-2027 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తిగా పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన స్పష్టం చేశారు.
కార్మికుల భద్రతే ముఖ్యం.. నిర్లక్ష్యం వద్దు
నిర్మాణ ప్రదేశాల్లో పనిచేసే కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, అన్ని రకాల భద్రతా నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఎండీ సూచించారు. పనుల నిర్వహణలో ఎటువంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పనులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ఈ క్షేత్రస్థాయి పరిశీలన కార్యక్రమంలో జలమండలి ప్రాజెక్ట్ డైరెక్టర్ మహేష్ కుమార్, ప్రాజెక్ట్ విభాగపు ఉన్నతాధికారులు, ప్రాజెక్టు అమలు సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.






