అగ్ని‌గుండంలా తెలంగాణ.. వడదెబ్బతో నిన్న ఒక్కరోజే 22 మంది మృతి!

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-22 02:17:03  IST  )

రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రతతో వడదెబ్బ మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

అగ్ని‌గుండంలా తెలంగాణ.. వడదెబ్బతో నిన్న ఒక్కరోజే 22 మంది మృతి!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ (Telangana)లో మునుపెన్నడూ లేని విధంగా పగటి ఉష్ణోగ్రతలు ఏకంగా 45 డిగ్రీల మార్కును దాటి నమోదువుతున్నాయి. గురువారం అత్యధికంగా పెద్దపల్లి, సూర్యాపేట జిల్లాల్లో 46.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో వడదెబ్బ మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో ఎండ తీవ్రత తట్టుకోలేక వేర్వేరు ప్రాంతాల్లో 22 మంది మృతిచెందారు. ఉదయం 9 గంటల నుంచే సూర్యుడు ప్రతాపం చూపిస్తుండటంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. మధ్యాహ్నం వేళల్లో రహదారులన్నీ జనసంచారం లేక వెలవెలబోతున్నాయి,

నేడు తీవ్ర వడగాల్పుల హెచ్చరిక..

రాష్ట్రంలో ఎండల తీవ్రత ఇప్పుడప్పుడే తగ్గేలా కనిపించడం లేదని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ కూడా పలు జిల్లాల్లో తీవ్రమైన వడగాల్పులు (Severe Heatwave) వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలపై ఎండల ప్రభావం ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని వైద్యులు సూచిస్తున్నారు. బయటకు వెళ్లాల్సి వస్తే తలకు రుమాలు, గొడుగు వాడాలని, డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండటానికి ఓఆర్ఎస్ (ORS) ద్రావణం, మజ్జిగ, కొబ్బరినీళ్లు, తగినంత మంచి నీరు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Next Story