అగ్నిగుండంలా తెలంగాణ.. దిలావర్‌పూర్‌లో 46.5 డిగ్రీల రికార్డు ఉష్ణోగ్రత

by Kema Shiva Kumar |

తెలంగాణలో ఎండలు రికార్డు స్థాయికి చేరాయి. నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్‌లో ఈ ఏడాదిలోనే అత్యధికంగా 46.5°C ఉష్ణోగ్రత నమోదైంది.

అగ్నిగుండంలా తెలంగాణ.. దిలావర్‌పూర్‌లో 46.5 డిగ్రీల రికార్డు ఉష్ణోగ్రత
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా ఎండలు తీవ్ర రూపం దాల్చాయి. రోహిణి కార్తె (Rohini Karte) ప్రవేశానికి ముందే సూర్య భగవానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. రాష్ట్రంలోని మెజారిటీ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల మార్కును దాటడంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలు నిప్పుల గుండాల్లా మారాయి. అత్యధికంగా నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్‌లో 46.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదై, ఈ సీజన్‌లోనే అత్యంత వేడి రోజుగా నిలిచింది.

పెరిగిన వడగాల్పుల తీవ్రత..

రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో వడగాల్పుల తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. హన్మకొండ, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో 46.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. జగిత్యాల, జనగాం, ఖమ్మం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్ జిల్లాల్లో పాదరసం 46.3 డిగ్రీలకు చేరింది. అదేవిధంగా ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సిద్దిపేట, సూర్యాపేట జిల్లాల్లో 46.2 డిగ్రీలు, ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో 46.1 డిగ్రీలు, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో 46.0 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కూడా 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది.

ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రత మొదలవుతుండటంతో, మధ్యాహ్నానికి ప్రధాన రహదారులన్నీ జనసంచారం లేక వెలవెలబోతున్నాయి. వేడి గాలుల కారణంగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. ఈ తీవ్రమైన పరిస్థితుల దృష్ట్యా వైద్య ఆరోగ్య శాఖ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు ఉప్ప, చక్కర కలిపిన ద్రావణం, మజ్జిగ, కొబ్బరినీళ్లు ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు మధ్యాహ్నం వేళల్లో ఇళ్లలోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు.

Next Story