- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: చలికి వణుకుతున్న జనం
రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. దీని ఫలితంగా చలి తీవ్రత అనూహ్యంగా పెరగడంతో సామాన్య ప్రజలు చలికి గజగజ వణుకుతున్నారు. రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది కనిష్ట ఉష్ణోగ్రతలు దాదాపు సగం వరకు తగ్గినట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. సాయంత్రం ఆరు గంటల నుంచే చల్లని గాలులు వీచడం ప్రారంభమై, తెల్లవారుజామున 4 నుంచి 6 గంటల మధ్య అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, ఏజెన్సీలలో ఈ చలి ప్రభావం అధికంగా ఉంది. అనేక చోట్ల ప్రజలు చలి నుంచి ఉపశమనం పొందడానికి మంటలు వేసుకుంటున్నారు. ఉదయం పూట కూడా చలి ప్రభావం కొనసాగుతుండటంతో, వృద్ధులు, చిన్నారులు ఇళ్లలోంచి బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. రాగల మూడు రోజులు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీల సెంటీగ్రేడు నుండి 4 డిగ్రీల సెంటిగ్రేడు వరకు తక్కువగా ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గడిచిన వారంరోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయినట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. 20 డిగ్రీల నుండి కొన్నిచోట్ల 15, మరికొన్ని చోట్ల 10 డీగ్రీల సెల్సియస్ వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు పేర్కొంది.
సిర్పూర్‌లో 7.4 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత:
రాష్ట్రంలో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతల కుమరం భీం అసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ లో 7.4 డిగ్రీ సెల్సియస్ నమోదైంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో అత్యల్పంగా 10 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అత్యవసరమైతే తప్ప ఉదయం పూట ప్రయాణాలను తగ్గించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.






