బంగాళఖాతంలో అల్పపీడనం.. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు

by Yella Dhawani Reddy |   (  Updated:2025-06-27 06:27:01  IST  )

బంగాళఖాతంలో అల్పపీడనం.. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు
X

దిశ, వెబ్ డెస్క్: వాయవ్య బంగాళాఖాతంలో గురువారం అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు (Heavy rains) కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.

ఇక ఇవాళ ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కాగా, వర్షాల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు, ముఖ్యంగా నదులు, వాగుల పరివాహక ప్రాంతాల్లో నివసించేవారు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు.

Next Story