- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ
రాష్ట్రంలో రాగల మూడు రోజులు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రాగల మూడు రోజులు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వీచే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌ల మీదుగా సముద్ర మట్టం నుండి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్పపీడనం బంగాళాఖాతం వైపు కదులుతూ వర్షాలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్..
రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. రానున్న 24 గంటల్లో ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఆదిలాబాద్ జిల్లాలో అత్యధిక వర్షపాతం..
ఆదిలాబాద్ జిల్లాలోని తంసీ ప్రాంతంలో మంగళవారం అత్యధికంగా 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్ జిల్లాలోని పలుచోట్ల ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్ల మీద వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వర్షాల వల్ల పంటలకు కొంత నష్టం వాటిల్లవచ్చని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్‌లో 6 సెం.మీ, తలమడుగులో 5 సెం.మీ, మంచిర్యాల జిల్లా జన్నారంలో 4 సెం.మీ, సూర్యాపేట్ జిల్లా చిల్కూర్‌లో 4 సెం.మీ, కరీంనగర్ జిల్లా శంకరపట్నంలో 3 సెం.మీ చొప్పున వర్షాపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ పేర్కొంది.






