కళాకారులను ప్రోత్సహించడం సమాజ బాధ్యత: కేటీఆర్

by Kodari Anjali |

రాజకీయాల ఒత్తిడికి భిన్నంగా సాహిత్య, కళా వేదికల్లో పాల్గొనడం ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

కళాకారులను ప్రోత్సహించడం సమాజ బాధ్యత: కేటీఆర్
X

దిశ, ఖైరతాబాద్: రాజకీయాల ఒత్తిడికి భిన్నంగా సాహిత్య, కళా వేదికల్లో పాల్గొనడం ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం నిర్వహించిన కార్టూనిస్ట్ శేఖర్ మెమోరియల్ అవార్డ్స్–2026 కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన విజేతలకు అవార్డులు ప్రదానం చేశారు. కార్టూన్ విభాగంలో ఎం. నారు, ఆర్టిస్టు విభాగంలో కూరెళ్ల శ్రీనివాస్ పురస్కారాలు అందుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఒక కార్టూన్ వెయ్యి పదాలకు సమానమని, సమాజంపై కార్టూనిస్టుల ప్రభావం ఎంతో గొప్పదని అన్నారు. ఆర్.కే. లక్ష్మణ్, బిల్ వాటర్‌సన్‌తో పాటు తెలుగు కార్టూనిస్టుల సేవలను ప్రశంసించారు. దేశానికి మహాత్మా గాంధీ విలువలు అవసరమని, మత విశ్వాసాలు వ్యక్తిగతమైనవని, పరస్పర గౌరవంతో సమాజం ముందుకు సాగాలని సూచించారు.

కేసీఆర్ తలలో తెలంగాణ మ్యాప్‌ను..

దివంగత కార్టూనిస్ట్ శేఖర్ తెలంగాణ ఉద్యమంలో తన కార్టూన్లతో విశేష పాత్ర పోషించారని కొనియాడిన కేటీఆర్, ఆయన స్మారకార్థం గత ఆరేళ్లుగా అవార్డులను నిర్వహిస్తున్న కుటుంబ సభ్యులు, మిత్రులను అభినందించారు. వచ్చే ఏడాది నుంచి ఈ కార్యక్రమాన్ని మరింత ఘనంగా నిర్వహించేందుకు తన పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రముఖ కార్టూనిస్ట్ శంకర్ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించే ఉద్దేశంతోనే మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) కార్టూన్‌ను రూపొందించినట్లు తెలిపారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ తలలో తెలంగాణ మ్యాప్‌ను చిత్రీకరించడం వెనుక ప్రత్యేకమైన సందేశం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేసిన ఉద్యమం, ఆయన పలుమార్లు చెప్పిన "తల తాకట్టు పెట్టైనా తెలంగాణ తెస్తా" అనే సంకల్పాన్ని కళారూపంలో ఆవిష్కరించాలనే ఉద్దేశంతో ఆ కార్టూన్‌ను రూపొందించినట్లు శంకర్ వివరించారు. ఆ కార్టూన్ తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజల్లో విశేష ఆదరణ పొందిందని, ఉద్యమ భావోద్వేగాలను ప్రతిబింబించేలా తీర్చిదిద్దినట్లు తెలిపారు. కార్టూన్ అనేది కేవలం చిత్రమే కాకుండా, ఒక సామాజిక సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే శక్తివంతమైన మాధ్యమమని ఆయన పేర్కొన్నారు.

Next Story