- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణకు ఐఎండీ ‘హీట్ వేవ్’ అలర్ట్.. రాబోయే 5 రోజులు నిప్పుల వర్షమే
ఎండలతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు భారత వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రాన్ని భానుడి బెంబేలెత్తిస్తుున్నాడు. ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్రమైన ఎండలు, వడగాల్పుల (Heatwave) తీవ్రత రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD) శాస్త్రవేత్త, వాతావరణ నిపుణుడు జీఎన్‌ఆర్‌ఎస్ శ్రీనివాసరావు హెచ్చరించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయని ఆయన వెల్లడించారు. తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మరో నాలుగు నుంచి 5 రోజుల పాటు ఇవే అధిక ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత క్రమంగా వరంగల్, హన్మకొండ పరిసర ప్రాంతాలు, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేటతో కూడిన మధ్య తెలంగాణ జిల్లాల్లో కూడా రాబోయే 3 నుంచి 4 రోజుల్లో వడగాల్పుల తీవ్రత పెరగనుందని స్పష్టం చేశారు.
నైరుతి రుతుపవనాల రాక ఎప్పుడంటే..
గత నాలుగు ఐదు రోజులుగా రాజధాని హైదరాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రతలు 39 డిగ్రీల నుంచి 41 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ఇవాళ ఖమ్మం జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కాగా.. గత వారం ఆదిలాబాద్ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైందని ఆయన తెలిపారు. తీవ్రమైన ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు వాతావరణ శాఖ ఒక ఊరటనిచ్చే వార్తను కూడా అందించింది. నైరుతి రుతుపవనాల (Southwest Monsoon) కదలికలపై శాస్త్రవేత్త శ్రీనివాసరావు క్లారిటీ ఇచ్చారు. రుతుపవన గాలులు ఇప్పటికే బంగాళాఖాతంలోకి ప్రవేశించాయని, అండమాన్ నికోబార్ దీవులను పూర్తిగా కవర్ చేస్తూ మధ్య బంగాళాఖాతం వైపు దూసుకుపోతున్నాయని తెలిపారు. మే 25 నుంచి మే 28 మధ్య రుతుపవనాలు కేరళ ప్రధాన భూభాగాన్ని తాకే అవకాశం ఉందన్నారు.
నైరుతి రుతు పవనాలు కేరళకు చేరుకున్న తర్వాత, రుతుపవనాలు తెలంగాణకు చేరుకోవడానికి సాధారణంగా మరో వారం రోజుల సమయం పడుతుంది. ఈ లెక్కన ఈ నైరుతి రుతుపవనాల తొలి వర్షాలు జూన్ మొదటి వారంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది.






