IMD: ద్రోణి, అల్పపీడనం ఎఫెక్ట్.. తెలంగాణలోని ఆ 11 జిల్లాల్లో జోరు వానలు

by Kema Shiva Kumar |

బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి, అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోని 11 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ (IMD) హెచ్చరికలు జారీ చేసింది.

IMD: ద్రోణి, అల్పపీడనం ఎఫెక్ట్.. తెలంగాణలోని ఆ 11 జిల్లాల్లో జోరు వానలు
X

దిశ, వె‌బ్‌డెస్క్: తెలంగాణ (Telangana) వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. రానున్న 2, 3 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం (India Meteorological Department) తెలిపింది. ఈ మేరకు ప్రజలు, ముఖ్యంగా ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. తాజా అప్‌డేట్ ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు గంటకు 30 కి.మీ నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

18 నుంచి 24 వరకు విస్తారంగా వర్షాలు..

రాష్ట్రంలో జూన్ 18 నుంచి 24 వరకు వారం రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతం (Bay of Bengal)లో ద్రోణి, అల్పపీడనం ఏర్పడే అవకాశాలు పుష్కలంగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని పేర్కొంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రుతుపవనాలు మరింత చురుగ్గా కదలనున్నాయి. అయితే, వర్షం పడే సమయంలో ఉరుములు, మెరుపులు వచ్చే ప్రమాదం ఉన్నందున ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, చెట్ల కింద గానీ, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడవద్దని అధికారులు సూచించారు. రైతులు, చేతివృత్తుల వారు వర్షంతో కారణంగా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

Next Story