- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన.. ఐటీ కారిడార్‌లో భారీగా ట్రాఫిక్ జామ్
హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి పలుచోట్ల భారీ వర్షం కురిసింది.

దిశ, వెబ్‌డెస్క్: ఎండలతో అల్లాడుతున్న నగరవాసులకు వరుణుడు భారీ ఉపశమనం కలిగించాడు. హైదరాబాద్ (Hyderabad)లోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడి, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. గ్రేటర్ హైదరాబాద్ (GHMC) పరిధితో పాటు సైబరాబాద్, మల్కాజ్‌గిరి జిల్లాల పరిధిలో ఓ మోస్తరు నుంచి కుండపోత వర్షం పడింది. హఠాత్తుగా కురిసిన ఈ వానతో నగరంలోని ప్రధాన రహదారులు జలమయమవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఐటీ కారిడార్‌లో కుండపోత వాన..
నగరంలోని ఐటీ హబ్‌గా పేరుగాంచిన గచ్చిబౌలి, హైటెక్ సిటీ, కొండాపూర్ ప్రాంతాల్లో వాన బీభత్సం సృష్టించింది. కుండపోతగా కురిసిన వర్షానికి కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే ఐటీ ఉద్యోగులు, వాహనదారులు రోడ్లపైనే తడిసిముద్దయ్యారు. మరోవైపు డ్రైనేజీలు పొంగిపొర్లడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, షేక్‌పేట, మణికొండ ప్రాంతాల్లో రోడ్లన్నీ చెరువులను తలపించాయి. పంజాగుట్ట, సోమాజిగూడ, ఖైరతాబాద్, బేగంపేట, మెహదీపట్నం, నాంపల్లి వంటి సెంట్రల్ జోన్ పరిధిలో వర్షం జోరుగా సాగింది. దిల్‌సుఖ్‌నగర్, వనస్థలిపురం, బీఎన్ రెడ్డి, ఎల్బీనగర్, మలక్‌పేట, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా ఓ మోస్తరు వర్షం కురిసింది. భారీ వర్షంతో జీహెచ్‌ఎంసీ యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. రోడ్లపై నిలిచిన నీటిని తొలగించేందుకు, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు హైడ్రా (HYDRAA)తో పాటు డీఆర్‌ఎఫ్ (DRF) సిబ్బంది రంగంలోకి దిగారు.






