- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Swiss Banks: స్విస్ బ్యాంకుల్లో తగ్గిన భారతీయుల సొమ్ము
స్థానిక బ్యాంకింగ్ శాఖలు, ఇతర ఆర్థిక సంస్థల ద్వారా నిర్వహించే నిధులు తగ్గడమే ఇందుకు ప్రధాన కారణం.

దిశ, బిజినెస్ బ్యూరో: స్విస్ బ్యాంకుల్లో ఉన్న భారతీయుల మొత్తం నిధులు గణనీయంగా తగ్గాయి. స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంక్ (స్విస్ నేషనల్ బ్యాంక్-ఎస్ఎన్‌బీ) గురువారం విడుదల చేసిన తాజా వార్షిక గణాంకాల ప్రకారం, 2025లో భారతీయుల సొమ్ము 8 శాతానికి పైగా తగ్గి 3.25 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌లకు (దాదాపు రూ. 36,793 కోట్లు) పడిపోయాయి. స్థానిక బ్యాంకింగ్ శాఖలు, ఇతర ఆర్థిక సంస్థల ద్వారా నిర్వహించే నిధులు తగ్గడమే ఇందుకు ప్రధాన కారణం. అంతకుముందు 2024లో ఈ నిధులు మూడు రెట్లు పెరిగి 3.5 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌లకు చేరినప్పటికీ, ఈసారి మళ్లీ క్షీణించాయి. అయితే, వ్యక్తులు, ప్రైవేట్ సంస్థలకు సంబంధించిన సొంత ఖాతాల (పర్సనల్ డిపాజిట్లు) నిధులు మాత్రం ఈ ఏడాది ఏకంగా 50 శాతానికి పైగా భారీగా పెరిగి 524 మిలియన్ స్విస్ ఫ్రాంక్‌లకు (దాదాపు రూ. 6,000 కోట్లు) చేరడం గమనార్హం.
గ్లోబల్ రేసులో 46వ స్థానానికి భారత్
స్విస్ బ్యాంకుల్లో అత్యధికంగా డబ్బులు దాచుకున్న దేశాల జాబితాలో బ్రిటన్ (యూకే) 192 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌లతో టాప్ ప్లేస్‌లో నిలవగా, అమెరికా రెండో స్థానంలో, ఫ్రాన్స్ మూడో స్థానంలో నిలిచాయి. ఆ తర్వాత జర్మనీ, సింగపూర్, యూఏఈ వంటి దేశాలు టాప్-10 లో ఉన్నాయి. ఈ గ్లోబల్ రేటింగ్‌లో భారత్ గతంలో ఉన్న 48వ స్థానం నుంచి రెండు మెట్లు ఎగబాకి ప్రస్తుతం 46వ స్థానానికి చేరుకుంది. ఇక మన పొరుగు దేశాల విషయానికి వస్తే.. పాకిస్తాన్ నిధులు స్వల్పంగా తగ్గి 257 మిలియన్ స్విస్ ఫ్రాంక్‌లకు చేరగా, బంగ్లాదేశ్ నిధులు మాత్రం ఏకంగా 43 శాతం భారీగా పెరిగి 842 మిలియన్ స్విస్ ఫ్రాంక్‌లకు చేరాయి. గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో బంగ్లాదేశ్ 81వ స్థానంలో, పాకిస్తాన్ 108వ స్థానంలో ఉన్నాయి.






