- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణకు ఎండల ముప్పు.. ఉత్తర జిల్లాలకు ‘హీట్ వేవ్’ అలర్ట్
తెలంగాణలో నైరుతి రుతపవనాలు మందకొడిగా కదులుతున్నాయి. దీంతో ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్‌తో సహా 10 జిల్లాలకు వాతావరణ శాఖ హీట్ వేవ్ అలర్ట్ జారీ చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో (Telangana) వాతావరణం మళ్లీ ఆందోళనకరంగా మారింది. ఆషాఢ మాసం ప్రవేశిస్తున్నా నైరుతి రుతుపవనాల గమనం మందకొడిగా సాగుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఇంకా పూర్తి స్థాయిలో వర్షాలు విస్తరించలేదు. ఈ నేపథ్యంలో ఎండల తీవ్రత మళ్లీ పెరిగింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భానుడి భగభగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో ఉత్తర తెలంగాణలోని 10 జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ శాఖ హీట్ వేవ్ (Heat Wave) హెచ్చరికలను జారీ చేసింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమురం బీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సరిసిల్ల జిల్లాలకు భారీగా వడగాల్పులు వీయనున్నాయి. ఆయా జిల్లాల్లో ఇప్పటికే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ను దాటి నమోదవుతున్నాయి. జూన్ మధ్య మే నెల తరహాలోనే ఎండలు దంచికొడుతుండటంతో జన ఉక్కపోతతో, వడగాల్పులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మరో 4 రోజుల్లో ఉపశమనం..
ప్రస్తుత వాతావరణ పరిస్థితిపై హైదరాబాద్ వాతావరణ శాఖ (Hyderabad Meteorological Department) అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రస్తుతం రుతుపవనాల కదలికలు నెమ్మదించాయని తెలిపారు. అందువల్లే రాష్ట్రంలో వర్షాలు కురవకుండా భారీగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని పేర్కొన్నారు. రాబోయే 4 రోజుల్లో ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. అప్పటి వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున మధ్యాహ్నం వేళల్లో ప్రజలు, వృద్ధులు బయటకు రావోద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.






